కేంద్రానికి సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : దేశంలో అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అమెరికాలో మాదిరిగా సరిహద్దు గోడ కట్టాలనుకుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్నప్పటికీ.. భారతీయులు పొరుగు దేశాలతో భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకుంటున్నారన్నారని పేర్కొంది. సరిహద్దుల ద్వారా వేరుగా ఉన్నా.. ఒకే భాష మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయాన్ని తెలియజేయాలన్నది.
వలసదారులను అక్రమంగా నిర్బంధించి పంపించి వేస్తున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ మనుభారు పంచోలీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బెంగాలీ మాట్లాడే వారిని తీసుకెళ్లి బలవంతంగా బంగ్లాదేశ్‌కు పంపిస్తున్నారని పిటిషన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. జాతీయత నిర్ధారణ అయ్యే వరకూ పంపించకుండా వలసదారులకు ఉపశమనం కలిగించాలని కోరారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. బెంగాలీ మాట్లాడే వలసదారులను బంగ్లాదేశ్ పౌరులుగా అనుమానిస్తూ నిర్బంధిస్తున్నారని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధిత పార్టీలు ఎవరూ కోర్టు ముందు హాజరు కాలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. వనరుల కొరత కారణంగా వాళ్లు న్యాయస్థానానికి రాకపోయి ఉండవచ్చని అభిప్రాయపడింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మెహతా.. అమెరికా వ్యక్తులకు సాయం చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించడంలో వారికి ఇటువంటి ప్రజాస్ఫూర్తి కలిగిన వ్యక్తులు తప్పకుండా సాయం చేయాలని అన్నారు.
ఇందుకు జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. భారత్‌లోకి అక్రమ వలసదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే అమెరికాలో మాదిరిగా సరిహద్దు గోడ కట్టాలనుకుంటున్నారా? అని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు. దీనికి మెహతా బదులిస్తూ.. అటువంటిదేమీ లేదన్నారు. అయితే, పిటిషనర్ ఆరోపిస్తున్నప్పటికీ.. వీటికి సంబంధించి కచ్చితమైన ఫిర్యాదులేమీ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నప్పటికీ.. బెంగాలీ, పంజాబీ భాషలు మాట్లాడే భారతీయులు పొరుగుదేశాలతో భాషా, సాంస్కతిక వారసత్వాన్ని పంచుకుంటున్నారని, సరిహద్దుల ద్వారా వేరుగా ఉన్నా, ఒకే భాష మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడంతోపాటు, వీరిని వెనక్కి పంపించేందుకు అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌ఓపీ) ఏంటనే విషయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చుతున్నట్టు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
అమెరికాలో మాదిరిగా సరిహద్దు గోడ కావాలా?
- Advertisement -
- Advertisement -