Thursday, October 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఏకగ్రీవాలను ప్రోత్సహించేనా..?

ఏకగ్రీవాలను ప్రోత్సహించేనా..?

- Advertisement -

గత ఎన్నికల్లో రూ.10 లక్షల ప్రకటన
నజరాన ప్రకటించి నిధులివ్వని బీఆర్‌ఎస్‌
ఈసారి ఏమైనా ప్రోత్సాహం కల్పించేనా..?
స్థానిక సంస్థలకు ఇద్దరు పిల్లల నిబంధన


నవతెలంగాణ-నిజామాబాద్‌, మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధులు
సర్పంచి ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు మొత్తంగా రూ.15 లక్షలు చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ నిధులతో గ్రామాభివృద్ధి చేపట్టొచ్చనే భావనతో పలు గ్రామాలు తమ సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కానీ ఊరించి ఊరించి ఉసురూమనిపించినట్టు సర్పంచి పదవీకాలంలో ఒక్క పైసా చెల్లించలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలోని 530 గ్రామాలకు 130 గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,732 గ్రామాలకు గాను 2134 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సగటు కంటే ఇక్కడే ఎక్కువ. అభ్యర్థులు సైతం ఏకగ్రీవం అయితే.. గ్రామాభివృద్ధికి, ప్రత్యేక నిర్మాణాలకు సొంత నిధులు వెచ్చిస్తామని హామీలు సైతం ఇచ్చారు. తీరా ఎన్నికలు పూర్తయిన తర్వాత నజరానా గురించి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని నాటి సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.

పదవీ కాలం పూర్తయ్యే నాటికి సైతం పైసా విదిల్చలే. దాంతో అప్పటి సర్పంచ్‌లకు గ్రామస్తుల నుంచి చివాట్లూ తప్పలేదు. సర్పంచ్‌ల పదవీకాలం 2023 జనవరితో పూర్తయినా దాదాపు ఏడాదిన్నర వరకు ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు నిధులు అందక పాలన అటకెక్కింది. రోజువారీ నిర్వహించే పనులు, మరమ్మతులకు సైతం నిధులు లేకపోవడంతో జీపీ కార్యదర్శులే అప్పులు తీసుకొచ్చి పనులు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం సర్పంచ్‌ ఎన్నికలను ఏకగ్రీవం చేసే గ్రామాలకు నజరానా ప్రకటించాలని కోరుతున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్పంచ్‌ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసేందుకు ఏమైనా ప్రోత్సాహం కల్పిస్తుందా అని పల్లెవాసులు ఎదురుచూస్తున్నారు.

ఇద్దరి పిల్లల నిబంధన..
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించనున్నది. పాత నిబంధనలతోనే ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే వారిలో కొందరికి ముగ్గురు పిల్లలు ఉండటంతో వారందరు ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. మొదట కాన్సులో ఒకరు పుట్టి రెండో కాన్సులో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే.

ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండి ఆమె చనిపోతే.. ఆయన రెండో పెండ్లి చేసుకుంటే ఆమెకు మరొక సంతానం కలిగితే భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. కానీ ఆమెకు ఒకరే సంతానం ఉన్నారు కాబట్టి భార్య మాత్రం పోటీ చేయొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి అందులో ఒకరు చనిపోతే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. మహిళకు ఇద్దరు పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఆమె గర్భవతి అయి ఉంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలేనని పంచాయతీరాజ్‌ శాఖ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రూ.50వేలకు మించి డబ్బులు రవాణా చేయకూడదనే నిబంధనలు పెట్టారు. దాంతో పండుగల పూట సామాన్యుల్లో భయాందోళన నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -