Tuesday, January 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎస్సీ విద్యార్థులంటే అంత అలుసా..?

ఎస్సీ విద్యార్థులంటే అంత అలుసా..?

- Advertisement -

విద్యార్థులతో వెట్టిచాకిరీ సరికాదు
బొర్లం ఎస్సీ గురుకులం ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్‌
బాలిక మృతిని నిరసిస్తూ బాన్సువాడలో రాస్తారోకో
నవతెలంగాణ-బాన్సువాడ(నసురుల్లాబాద్‌)

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేయాలని విద్యార్థి, దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా పాఠశాలకు ఓ ఆటోలో ఫర్నీచర్‌, కుర్చీలు రావడంతో ఆటోల నుంచి కుర్చీలను విద్యార్థులతో తీయిస్తుండగా డ్రైవర్‌, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. బొర్లం ఎస్సీ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థి, దళిత సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం బాన్సువాడ పట్టణంలో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రవీందర్‌, తదితర నాయకులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్‌కు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో గురుకుల పాఠశాలను విద్యార్థుల నిర్బంధ గృహంగా మార్చేశారని, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తూ.. అవహేళన చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్లం గురుకుల అంటే విద్యార్థులు భయాందోళనలకు గురవుతూ, విద్యకు ఆటంకం కలిగి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకోతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులతో తాము మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని గురుకులంలోనికి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతించకపోవడంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది.

విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి..
విద్యార్థిని సంగీత మృతిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే తన క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -