Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంజుట్టు మందు వాడుతున్నారా?

జుట్టు మందు వాడుతున్నారా?

- Advertisement -

శిశువులకు ప్రమాదకరం…కంటి సమస్యలూ వస్తాయి
న్యూఢిల్లీ : కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెత గుర్తుందా? దానిని కొద్దిగా సవరిద్దాం. జుట్టు రాలడాన్ని నివారించేందుకు మందు వాడితే జుట్టంతా ఊడదు కానీ అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలడాన్ని ఆపడానికి ప్రస్తుతం దేశంలో…కాదు కాదు…ప్రపంచ దేశాలలోనే విస్తృతంగా వినియోగిస్తున్న మందు మినోక్సిడిల్‌. అయితే ఇది శిశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. కంటికి సంబంధించిన అనేక సమస్యలూ ఉత్పన్నమవుతాయట. భద్రతకు సంబంధించిన ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా శిశువులకు సంబంధించి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 1,600కు పైగా కంటి రుగ్మతలు కన్పించాయి.

ఏమవుతుంది?
మినోక్సిడిల్‌ ప్రభావం పడిన ఇరవై మూడు నెలల లోపు వయసున్న చిన్నారులలో జుట్టు పెరుగుదల అధికంగా ఉన్నదని అధ్యయనం తెలియజేసింది. ఈ చిన్నారులకు మందును నేరుగా వాడకపోయినప్పటికీ సంరక్షకులు సహా కుటుంబంలో ఎవరు వాడినా వీరిపై ప్రభావం పడింది. ఎక్స్‌పోజర్‌కు గురైనా సమస్యలు తప్పవు. 2,664 మంది గర్భిణులు మినోక్సిడిల్‌ మందును వాడారని, వారికి జన్మించిన శిశువులలో జుట్టు పెరుగుదల అసాధారణంగా కన్పించిందని అధ్యయనంలో తేలింది. భారత్‌లో మాత్రం ఇలాంటి కేసులేవీ కన్పించలేదు. అయినా అప్రమత్తత అవసరమని అధ్యయన రచయితలు సూచించారు. కంటి ఆరోగ్యంపై కూడా అధ్యయనంలో ఆందోళన వ్యక్తమైంది. మినోక్సిడిల్‌ వినియోగం కారణంగా 1,660 మందిలో కంటికి సంబంధించిన రుగ్మతలు బయట పడ్డాయి. వీటిలో పాతిక కేసులు మన దేశంలోనే నమోదు కావడం గమనార్హం.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?
మందుల షాపుల్లో విస్తృతంగా లభిస్తున్న మినోక్సిడిల్‌ను వైద్యుల సలహా తీసుకోకుండా వినియోగించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శిశువులు, చిన్నారులపై దీని ప్రభావం అధికంగా ఉంటోంది. కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ మందును వాడవద్దని వైద్యులు సూచించారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ చిన్నారులు ఈ మందుకు ఎక్స్‌పోజ్‌ అయినా సమస్యలు తప్పవు. మినోక్సిడిల్‌ మందు లేబుల్‌పై తీవ్రమైన హెచ్చరికను ముద్రించాలని, నియంత్రణను కట్టుదిట్టం చేయాలని, ఫార్మసిస్టుల కౌన్సిలింగ్‌ తీసుకోవాలని నిపుణులు సలహా ఇచ్చారు.

రక్తపోటు నివారణ మందులో మార్పులు
మినోక్సిడిల్‌ను ఉపయోగించిన వారిలో తీవ్రమైన కంటి సమస్యలు కన్పించాయని అధ్యయనం తెలిపింది. అసలు దీనిని అధిక రక్తపోటును నివారించే మందుగా ప్రారంభంలో అభివృద్ధి చేశారు. దీనిని వాడిన వారిలో ఆ తర్వాత జుట్టు ఎదుగుదల సమస్య కన్పించింది. దీంతో మందు ఫార్ములేషన్‌ను మార్చి జుట్టు రాలడాన్ని నివారించే ఔషధంగా రూపొందించారు. విశేష ప్రాచుర్యం లభించిన ఈ మందు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉంది.
మందుల దుకాణాలలో సులభంగా లభిస్తోంది. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతోంది. మందు ప్రభావంపై ఇస్తున్న కౌన్సిలింగ్‌ చాలా పరిమితంగానే ఉంటోంది. ఫలితంగా దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా…ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులలో…బాగా పెరిగింది. అనేక ఆవాసాలలో ఇది కన్పిస్తోంది. చిన్నారులు పొరబాటున దీనిని తాకినా, లేదా కుటుంబసభ్యులలో ఎవరి శరీరం పైన అయినా ఈ మందు పడి పిల్లలు దానిని ముట్టుకున్నా వారు ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరించారు. జుట్టు రాలడాన్ని నివారించే మినోక్సిడిల్‌ మందు పెద్దలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీని దుష్ప్రభావాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉన్నదని అధ్యయన రచయితలు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -