Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకారు రావాలా? బుల్డోజర్‌ కావాలా?

కారు రావాలా? బుల్డోజర్‌ కావాలా?

- Advertisement -

మాగంటి గోపీనాథ్‌ చేసిన అభివృద్ధిని చూసి
ఓటు వేయండి : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌,మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌

రాష్ట్రంలో కారు రావాలా? బుల్డోజర్‌ కావాలా? ఓటర్లు నిర్ణయించుకోవాలని, హైడ్రా రద్దు కావాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్‌లోని గ్రౌండ్‌లో కేటీఆర్‌ అధ్యక్షతన సోమవారం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ విజయానికి కసి, పట్టుదల, తపన అవసరమని, ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. దివంగత మాగంటి గోపీనాథ్‌ ఆడబిడ్డలకు చిరు కానుకలు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. ఆ కుటుంబానికి అండగా నిలవడం అందరి బాధ్యత అన్నారు. రేవంత్‌ పాలనపై ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని, కాంగ్రెస్‌ మోసపూరిత పాలన బాకీ కార్డులను పంచాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, వృద్ధులకు రూ.4000 పెన్షన్‌ రావాలన్నా.. మాగంటి సునీత గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానం అదిరిపడాలన్నారు. అలాగే, ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించారని, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లు పడకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లోని వాటర్‌ రిజర్వాయర్‌ మాగంటి గోపీనాథ్‌ పేరు పెట్టాలని, రిజర్వాయర్‌ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు.

ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్‌ చేసిన అభివృద్ధి, కేసీఆర్‌తో కలిసి నిధులు రాబట్టుకోవడంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సచ్చిపోయిందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం డబ్బులు అడిగిందని ఆరోపించారు. మాగంటి సునీత గోపీనాథ్‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అంటేనే మాగంటి గోపీనాథ్‌ అని, ఇంతమంది కుటుంబ సభ్యులను తనకు అండగా ఉంచి ఆయన దివంగతులయ్యారని, అండగా ఉండి తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, నాయకులు దేదీప్యరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -