Sunday, October 19, 2025
E-PAPER
Homeచౌరస్తాడాక్టర్‌! డాక్టర్‌!

డాక్టర్‌! డాక్టర్‌!

- Advertisement -

స్కూళ్లు ఎందుకుంటాయి? చదువు చెప్పటానికి. చదువెవరు చెప్పారు? టీచర్లు. చదువెవరు చదువుకుంటారు. విద్యార్థులు. స్కూల్లో టీచర్లు చదువు చెప్తే చదువుకునే విద్యార్థులేమవుతారు. ఉద్యోగులవుతారు. లీడర్లవుతారు. మంత్రులవుతారు, పోలీసులవుతారు, ఇంజనీర్లు, డాక్టర్లూ అవుతారు.
పండుగాడి అసలు పేరు రవీంద్ర. అయితేనేం వాడ్ని ఇంట్లో అందరూ పండు అనే పిలుస్తారు. ఇంట్లో పండుగాడ్ని ముద్దుగా పండు అని పిలుస్తారన్న విషయం తెల్సిన కొందరు సావాసగాళ్లు… పళ్లు అంటే బాగా ఇష్టమున్నవాళ్లు, ఏ పండో తెలీకపోతేనేం పండుగాడ్ని పండు అని పిలవడం మొదలెట్టారు. పండుగాడ్ని పండు అనడం బానే వుందని టీచర్లు కూడా పండును పండు అనే పిలవడం నేర్చేకున్నారు. ఊర్కే నల్లబల్ల మీద లెక్కలు రాసీ రాసీ వేళ్లు నొప్పిపుట్టిన లెక్కల మాస్టారు లెక్కల మీద మొహం మొత్తి మామూలు బల్లమీద కాళ్లూపుకుంటూ కూచుని, సరదాగా విద్యార్థులని భవిష్యత్తులో తాము ఏమవుదామనుకుంటున్నారోనని ఆరా తీశాడు. పోలీసు కొడుకు ఇన్‌స్పెక్టర్‌ అవుతానన్నాడు. కౌన్సిలర్‌ కొడుకు ఎం.ఎల్‌.ఎ అవుతానంటే, ఎం.ఎల్‌.ఎ. మనవడు మంత్రినవుతానన్నాడు. ఒకడు సినిమా యాకర్టర్‌ని అవుతానంటే, ఒకమ్మాయి సింగర్‌ని అవుతానని రాగం ఎత్తుకుంది. చాలామంది క్రికెటర్లమవుతామన్నారు. వెనక బెంచీలో కూచుని ఏమవుతానని చెప్పాలా అని ఆలోచిస్తున్న పండు, మాష్టారు ‘పండూ నిన్నే’ అని గట్టిగా అరవడంతో గబుక్కున లేచి తడబాటు లేకుండా డాక్టర్ని అవుతాను అన్నాడు.
వినపడ్లా, గట్టిగా చెప్పరా అన్నాడు మాస్టారు. బుర్ర గోక్కోవడం మాని, నిటారుగా గడకర్రలా నిలబడి గంభీరంగా కాన్ఫిడెంట్‌గా తన జీవిత లక్ష్యం అదే అన్నట్టుగా, తాను పుట్టిందే దాని కోసం అన్నట్టుగా డాక్టర్ని అవుతాను సార్‌… డాక్టర్ని అన్నాడు.
ఏ క్షణాన ఆ మాట పండు నోటంట వచ్చిందో కాని ఆ మాట మీదే వున్నాడు పండు. తాను ఎలాగైనా సరే డాక్టరవ్వాలని, తెల్లకోటు తొడుక్కొని, మెళ్లో స్టెతస్కోప్‌ వేలాడదీసుకోవాలని కలలు కనడం మొదలు పెట్టాడు. స్కూలయిపోయిందని కాలేజీ మొదలు పెట్టి దాని అంతూ చూశాడు కానీ విధి చాలా దుర్మార్గంగా, క్రూరాతి క్రూరంగా వక్రించి, వెక్కిరించింది. అందువల్ల తాను ఏం అవుతానని స్కూల్లో మాస్టారుకి చెప్పాడో, ఏం అవ్వాలని కలలు కన్నాడో అది మాత్రం అవలేకపోయాడు. కొన్నాళ్ల పాటు చింతించి వగచిన మాట నిజమేకాని, అన్ని చింతలకూ, మానసిక జబ్బులకూ, వేదాంతమూ వైరాగ్యమూ, సర్దుబాటులే కదా ఔషధాలు. అయినా అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా? మనుషులంతా అనుకున్నవన్నీ సాధిస్తారా? ఏది రాసి పెట్టి వుందో అదే అవుతుంది. మనమెవళ్లం… మన తలరాత రాసుకోడానికి అనుకోడం మొదలు పెట్టి, ఓ మామూలు ఉద్యోగం చేసుకుంటూ బతుకు జట్కాబండిని ఎగుడుదిగుడు రోడ్లమీద పడుతూ లేస్తూ నడిపిస్తున్న పండుకి తన వేదాంత ధోరణి కారణంగా మరో మంచి విద్య అబ్బింది. అదేం ఆషామాషీ విద్యకాదు. కవిత్వం రాయడమంటే మాటలే అయినా మాటలు కాదు. కవి అవడం అంటే మామూలు డాక్టరవడం కాదు, కవి అవడమే.
కవి అయిన పండు ‘నానీలు, హైకూలు, సరిగమలు, పదనిసలు, పనసలు, ఆసనాలు’ వంటి కొత్తవీ, పాతవీ ప్రక్రియల్ని ఉతికి ఆరేశాడు. బరువైన కథల్ని బండకేసి బాదేశాడు. వేలెడంత విషయాన్ని వ్యాసాలుగా సాగదీశాడు. అంతో ఇంటో కొంతో పేరు వచ్చింది కానీ సంతృప్తి కలగలేదు. ‘కలనిజమాయెగా కోరికె తీరెగా’ అని పాడుకోవాలంటే డాక్టరవ్వాలి కదా. అవకుండా పాడుకోటం ఎలా అన్న మరో చింత మొదలైంది. చింతలనేవి చివరిదాకా వుంటయి మరి అనుకున్న పండు తాను డాక్టర్‌ పండు… కాదు కాదు డాక్టర్‌ రవీంద్ర కాలేడా? కానేలేడా? అనుకుంటూ బక్క చిక్కి పోతున్నప్పుడు రెండు పద్ధతులు కనపడ్డయి. ఒకటి విశ్వవిద్యాలయంలో బండెడు పుస్తకాలు తలకెక్కించుకుని, బట్టతల తెచ్చేసుకుని డాక్టరవడం. మరొకటి… ఏ సంస్థనో, చిరునామా అనగా అడ్రసు లేని ఏ యూనివర్సిటీ నుంచో గౌరవ డార్టరేటు సంపాదించడం. ఈ రెండవ పద్ధతి కాస్త సులువైనది, తనకు అనువైనది అనుకున్నాడు. అనుకున్నది మొదలు రెండు చెవుల్లో డాక్టర్‌ రవీంద్రా! డాక్టర్‌ రవీంద్రా! డాక్టర్‌.. డాక్టర్‌… డాక్టర్‌.. అన్న మాటలు టంగుటంగున రింగి రింగుమని వినిపించసాగాయి.
అంగట్లో అన్నీ అమ్మబడతాయి. గౌరవ డార్టరేటుతో సహా! పదో పాతికో వేలు, టీవీ, ఫ్రిజ్జూ, మొబైలూ, జాకీ పైజమాలు, రామ్‌రాజ్‌ బనియన్లు కొనుక్కుని తొడుక్కోడంలా. అలాగే గౌరవ డాక్టరేటు కూడా అనుకుని, డాక్టర్‌ కాలేకపోతేనేం అని డాక్టర్‌ కొనడానికి బయలుదేరిన పండుకి నల్లపిల్లిలా ఎదురొచ్చిన ‘అకవి’ మిత్రుడు రాజేశ్‌, గౌరవ డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ పూజగడిలో పెట్టి పసుపూ కుంకం అంటించడానికి తప్ప, పేరుకు ముందు రొమ్ము విరుచుకుని డాక్టర్‌ అని పెట్టుకునేందుకు పనికిరాదని, అలాగనక వాడితే జైలులో ఊచలు అనే కవితా ప్రక్రియ కనిపెట్టి రాసుకోవలసి వస్తుందని అననే అన్నాడు.
పండుకి కోపమూ, ఆవేశమూ, ఆగ్రహమూ ఇంకా ఆ కోవకు చెందిన అనేక పదాలు వచ్చాయి. ఆ పైన ఆశువుగా అనేక మాటలు లోపల్నుంచి బైటికి తన్నుకుంటూ వచ్చాయి. అసలు కవులకు డాక్టరేట్లు కొని అతికించుకోవలసిన అవసరమేమిటి? రవి అంటే నాక్కాదు పైనుండే రవికి కనిపించనిది. కవులకు అంటే నాక్కూడా కనిపిస్తుంది. అక్షరాలతో ఆడుకునేవారికి, వాక్యాలతో కుస్తీపట్టే ‘క వస్తాదు’లకు, సమాజాన్ని బాగు చెయ్యడానికి, మనుషుల్ని రిపేరు చెయ్యడానికి, నిద్దర్లో కూడా కలవరించి పలవరించే వాళ్లకు ఈ సమాజం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలదు, గౌరవ డాక్టరేటు తప్ప. డాక్టరేట్‌ కంటే గౌరవ డాక్టరేట్‌ మరింత గొప్ప. ప్రభుత్వాలు ఇన్నిన్ని ఉచిత పథకాలు ప్రవేశపెడ్తున్నాయి కదా? కవులు బిరుదులడిగారా? భూములూ, వజ్రాల గొలుసులు అడిగారా? ఏ మాత్రం ఆర్థిక భారం పడని ఉచిత గౌరవ డాక్టరేట్లు కవులందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా ‘దర్భిణీ’ వేసుకుని ఎక్కడెక్కడున్నారో వెతికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చెయ్యకూడదా? కవులందరి పేర్లముందు డాక్టరేటు అన్న మాట వుంటే దేశానికి ఎంత పేరు ప్రఖ్యాతి. డాక్టర్‌ కాని డాక్టర్‌ పండు రవీంద్ర మాటలకు బిత్తరపోయింది నల్లపిల్లి కాదు పోయాడు రాజేశ్‌.

  • చింతపట్ల సుదర్శన్‌
    9299809212
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -