– ప్రతి ఇంటా ఓ వైద్యుడు!
– వైద్య వత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మోత్కులగూడెం
– సుమారు 35 మంది డాక్టర్లుగా స్థిరపడిన వైనం
నవతెలంగాణ – జమ్మికుంట
‘పట్టుదల ఉంటే దేన్నైనా సాధించొచ్చు’ అని నిరూపిస్తున్నారు ఆ పల్లె యువత. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఓ మారుమూల వ్యవసాయ ఆధారిత గ్రామం నేడు వైద్య వృత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం మోత్కులగూడెం నుంచి సుమారు 35 మంది యువత ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
తల్లిదండ్రుల కష్టాన్ని చూసి, తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదువుతున్న ఈ గ్రామం పిల్లలు.. వైద్య వృత్తికి వన్నె తెస్తున్నారు. ఈ కారణంగానే మోత్కులగూడెంను పరిసర ప్రాంతాల ప్రజలు ముద్దుగా ‘డాక్టర్ల గూడెం’ అని పిలుచుకుంటున్నారు.
జమ్మికుంట పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామం మోత్కులగూడెం. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సుమారు 6వేల జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం ప్రస్తుతం ఎంబీబీఎస్ డాక్టర్ల నిలయమైంది. ప్రతి ఏటా నీట్ పరీక్షల్లో ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో కూడా చాలామంది సీట్లు సాధించారు. ఇప్పటివరకు సుమారు 35 మంది డాక్టర్లు తయారయ్యారు. ఇందులో ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య సేవలు అందిస్తున్న వారు, ఎంబీబీఎస్, ఆపై ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారు ఉన్నారు.
పేదలకు సేవ.. గ్రామానికే గర్వకారణం
మోత్కులగూడెం బిడ్డలు డాక్టర్లు అయ్యి, తమ గ్రామానికి, ప్రాంతానికి సేవలు అందించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ కిషోర్ కామిశెట్టి (ఎండి పల్మనాలజీ), డాక్టర్ ఉడుగుల సురేష్ (ఎంబీబీఎస్, ఎండి అనస్థీషియా, ఎండి జనరల్ ఫిజీషియన్), డాక్టర్ ఉడుగుల అనిత జమ్మికుంట పట్టణంలో సంజీవని ఆస్పత్రిని నడుపుతున్నారు. అలాగే, ప్రముఖ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (ఎండి జనరల్ ఫిజిషియన్) ఆదిత్య ఆస్పత్రిని స్థాపించి సేవలందిస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది
ఎక్కువ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి, వైద్య వృత్తిలో ప్రవేశించడం చాలా ఆనందకరం. నేను తక్కువ ఫీజుతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నాను. కొత్తగా ఎంబీబీఎస్ సీటు సాధించినవారు గ్రామాభివృద్ధికి, సమాజ ఆరోగ్యానికి తోడ్పడాలి.
డాక్టర్ కిషోర్ కుమార్ కామిశెట్టి, ఎమ్‌డి పల్మనాలజీ
మోతుల్ర గూడెంకే గర్వకారణం
మోత్కుల గూడెంలో సుమారు 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్ సీటు సాధించడం చాలా గర్వకారణం. నేను గోల్డ్ మెడల్ సాధించాను. ప్రస్తుతం సంజీవని ఆస్పత్రిని స్థాపించి, పేదలకు సేవలు అందించడంలో ఎంతో సంతృప్తిగా ఉంది.
డాక్టర్ ఉడుగుల సురేష్
తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదివాను
మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాను. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. డాక్టర్ అయి సమాజంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పం ఉంది.
ఏబూసి అశ్విత (నీట్‌లో సీటు సాధించిన విద్యార్థిని)
పేదలకు వైద్యాన్ని అందించడమే లక్ష్యం
వైద్య వృత్తి ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలన్న సంకల్పంతో కష్టపడి డాక్టర్ అయ్యాను. ఈ చిన్న గ్రామంలో సుమారు 35 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గొప్ప విషయం. పేదలను దృష్టిలో పెట్టుకొని వైద్యాన్ని అందించడమే నా లక్ష్యం.
డాక్టర్ ఆకుల శ్రీనివాస్