కానిస్టేబుల్‌ను నిలదీసిన హైకోర్టు
ఇలాగే ఉంటే సస్పెన్షన్‌కు ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. ఇదే తీరుగా మళ్లీ జోక్యం చేసుకుంటే సస్పెన్షన్‌కు ఆదేశిస్తామని హెచ్చరించింది. పిటిషనర్‌ను బెదిరించడం, హైకోర్టులోని పిటిషన్‌ను వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నొక్కి చెప్పింది.కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం చేస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయంది.
నాగారంలోని భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్రమంగా తమ పేరిట పట్టా పొందారనీ, దీనిపై ఎంక్వయిరీ కమిషన్‌తో విచారణకు ఆదేశించాలంటూ పడమటి తండాకు చెందిన రాములు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును వాపస్ తీసుకోవాలంటూ పోలీసులు తనను బెదిరిస్తున్నారంటూ తాజాగా మరో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు ఫోన్ చేసిన మహేశ్వరం పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించారు. మంగళవారం జరిగిన విచారణకు కానిస్టేబుల్ స్వయంగా హాజరయ్యారు. పిటిషనర్ రాములుకు ఫోన్ చేశావా.. ఎవరు చేయమంటే చేశావు.. పిటిషన్‌ను వాపస్ తీసుకోవాలని బెదిరించావా.. అని కానిస్టేబుల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. విలేజీ హిస్టరీ రికార్డు నమోదులో భాగంగా రాములుకు ఫోన్ చేశారని కానిస్టేబుల్ బదులిచ్చారు. ఎస్‌హెచ్‌వో ఆదేశాల మేరకే ఫోన్ చేసినట్లు చెప్పారు. కోర్టులోని పిటిషన్ గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. దీనిపై హైకోర్టు, మరోసారి బెదిరించినట్టు తెలిస్తే సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. సుమారు 25 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెందిన వ్యవహారమనీ, ఈ విషయంలో పోలీసులు తలదూరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇక మీద పోలీసులు పిటిషనర్ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలి వ్వాలని లాయర్ విజయలక్ష్మి కోరగా, తామిచ్చిన హెచ్చరి కలు సరిపోతాయనీ, రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెదిరింపులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను ముగించింది.
రైల్వే లాండ్రీ టెండర్‌లో బిడ్ తిరస్కరణపై పిటిషన్
రైల్వే లాండ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 434 కోట్ల విలువైన టెండర్‌లో ఒక బిడ్డర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ చర్యపై విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రైల్వేలతో బూట్ మోడల్‌లో వాణిజ్య లాండ్రీ సేవలను పిటిషనర్ సంస్థ అందిస్తోంది. 2025 మే 15న విడుదలైన టెండర్‌కు పిటిషనర్ సంస్థ బిడ్లు సమర్పించింది. అయితే సుప్రీం లాండ్రీ సర్వీసెస్ జాయింట్ వెంచర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన పత్రాలు పిటిషనర్ సంస్థ ఏఎస్‌జీ సుప్రీం లాండ్రీ సర్వీసెస్, సమర్పించలేదని చెప్పి అధికారులు గత జూలై 26న బిడ్‌ను తిరస్కరించారు. వాటిని సాంకేతిక కారణాల వల్ల అప్‌లోడ్ చేయలేకపోయామని పిటిషనర్ న్యాయవాది ఎ.వెంకటేశ్ వాదించారు. తిరస్కరించిన తర్వాత రోజు పత్రాలను సమర్పించినట్టు వివరించారు. టెండర్‌లో తమ బిడ్ తక్కువ ధరకు కోట్ చేశామనీ, అయినప్పటికీ పిటిషనర్ బిడ్‌ను అన్యాయంగా తిరస్కరించారని చెప్పారు. దీనిపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి.నర్సింహశర్మ ప్రతివాదన చేస్తూ, గడువు ముగిసిన తర్వాత పత్రాలు సమర్పించినట్లు పిటిషనరే అంగీకరిస్తున్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, టెండర్ ప్రక్రియలో సందిగ్ధత నెలకొంటే కోర్టులు జోక్యం చేసుకోవాలని టాటా మోటార్స్ కేసులో సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేసింది. టెండర్‌ను ఇంకా ఖరారు చేయ లేదని కూడా గుర్తు చేసింది. ఈ నెల 18న సమగ్ర విచారణ చేస్తామని జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ప్రకటించారు.
అత్తమామలపై కేసు రద్దు చేసిన హైకోర్టు
వివాహ వివాదాల నేపథ్యంలో అత్తమామలపై దాఖలైన కేసును రద్దు చేస్తూ హైకోర్టు జస్టిస్ జువ్వడి శ్రీదేవి ఇటీవల తీర్పు వెలువరించారు. ఐపీసీలోని 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద నమోదైన కేసుల్లోని ఆరోపణలకు స్పష్టత లేదనీ, సాదాసీదా ఆరోపణలతో కేసు పెట్టారని తప్పుపట్టారు. నిర్ధిష్ట ఆధారాలు లేకుండా కేసు పెట్టారని ఆక్షేపించారు. మహారాష్ట్రకు చెందిన గోవింద్ ప్రసాద్ శర్మ, ఉష శర్మ వృద్ధ దంపతులైన అత్తమామలపై రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, అత్తాపూర్‌లో ఉండే కోడలు ఫిర్యాదు చేశారు. శర్మ కుమారుడు మహేశ్‌కు 2017లో వివాహం జరిగింది. అత్తమామలపై కోడలు 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారిపై 498ఎ కింద కేసు నమోదు అయ్యింది. మహారాష్ట్రలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ప్రయత్నం చేస్తూనే అత్తమామలు రూ.10 లక్షలు అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని కేసు పెట్టారని, అయితే, అత్తమామలు దౌర్జన్యం చేశారని బాధితురాలు ఆరోపించారేగానీ, ఏతేదీన, ఎక్కడ దౌర్జన్యానికి పాల్పడిందీ వివరించలేదని న్యాయమూర్తి తప్పుపట్టారు. కుటుంబసభ్యులపై నిరాధార ఆరోపణలు చేసి తప్పుడు కేసులు నమోదు వల్ల చట్టం దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు భజన్‌లాల్ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, వ్యక్తిగత ప్రతీకారంతో అత్తమామలపై కేసు పెట్టినట్లుగా ఉందన్నారు. అత్తమామలపై క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.
యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులుకింది కోర్టు ఆదేశాలను తప్పుపట్టిన హైకోర్టు
నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోగా కోర్టులో హాజరుపర్చలేదని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా కింది కోర్టు యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులను జారీ చేసిందని హైకోర్టు తప్పుపట్టింది. రిమాండ్ ఆదేశాలు చట్టవిరుద్ధమని జస్టిస్ ఎన్. తుకారాంజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, ఈడీ బజార్‌కు చెందిన సయ్యద్ దస్తగిరి చదువుతూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనిపై కేసు నమోదు చేసిన మలక్‌పేట పోలీసులు గత నెల జూలై 7న రాత్రి 10:15 గంటలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు రాత్రి 11:35 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంటే, 24 గంటల గడువు ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ జాప్యాన్ని గమనించకుండా మేజిస్ట్రేట్ చట్ట వ్యతిరేకంగా రిమాండ్ ఆదేశాలు ఇచ్చారని ఆక్షేపించారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 318(4), 204 రెడ్ విత్ 3(5) నమోదు చేసినవి నిరూపణ అయితే ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని, 35(3) కింద నోటీసు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. అర్నేష్ కుమార్ బీహార్ మధ్య జరిగిన కేసులో సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను పోలీసులు అమలు చేయలేదన్నారు. ఈ ఉత్తర్వులను అందుకున్న వెంటనే నిందితుడిని హైదరాబాద్ ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి విడుదల చేయాలని ఆదేశించారు. నిందితుడి నుంచి వారం రోజుల్లోగా రూ.10 వేల వ్యక్తిగత బాండ ్‌లను రెండు ఘ్యారిటీలు తీసుకోవాలని, కేసు దర్యాప్తునకు పిటిషనర్ సహకరించాలని తీర్పులో పేర్కొన్నారు.
భూదాన్ భూముల వివాదంలోఎలా జోక్యం చేసుకుంటారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES