Sunday, March 15, 2026
E-PAPER
Homeహెల్త్జీవితం పిల్లలదా... పెద్దలదా..?

జీవితం పిల్లలదా… పెద్దలదా..?

- Advertisement -

తల్లిదండ్రులు జీవించలేకపోయిన వారి జీవితం పిల్లలపౖౖె పడే అత్యంత భారమైన భారం.. ఒక మౌనమైన ప్రతిబింబం. మన సమాజంలో విజయం అంటే మార్కులు, జీతం, హోదా, స్టేటస్‌. ఈ లక్ష్యాల వెనుక ఒక ప్రశ్న దాగి ఉంటుంది. ”ఇది నిజంగా నా కోరికా? లేక ఎవరో నాపై పెట్టిన అంచనా మాత్రమేనా?”

జీవించని జీవితం… మౌనంగా బదిలీ అయ్యే భారం. చాలామంది తల్లిదండ్రులు తమ జీవితంలో తీసుకోలేని రిస్కులు, వాయిదా వేసిన కలలు, చెప్పలేని బాధలు మోస్తూ జీవిస్తారు. అవి మాటల్లో బయటపడవు.
కానీ పిల్లలపై అంచనాల రూపంలో దిగుతాయి.
‘నువ్వు ప్రత్యేకంగా ఉండాలి’
‘నువ్వు ఫస్ట్‌ రావాలి’
‘మన ఇంట్లో ఫెయిల్యూర్‌ ఉండకూడదు’
ఇది ప్రేమలా కనిపిస్తుంది. కానీ ఇది పిల్లలకు తెలియకుండానే వేసే భావోద్వేగ బాధ్యత.
ఒక కేస్‌ :
రాహుల్‌ ఒక మిడిల్‌ క్లాస్‌ కుటుంబంలో పెరిగాడు.
తండ్రి ప్రతిసారీ చెప్పేవాడు: ”నేను చదవలేకపోయాను. నువ్వైనా బాగా చదవాలి…ఎదగాలి.” అది ఆదేశం కాదు. అది బాధతో వచ్చిన ఆశ.
రాహుల్‌ బాగా చదివాడు. ఇంజినీరింగ్‌ చేశాడు. మంచి కంపెనీలో జాబ్‌ వచ్చింది. బయటికి చూస్తే సక్సెస్‌. లోపల మాత్రం ప్రతి చిన్న తప్పుకు భయం. సెలవు తీసుకుంటే నేరం చేసినట్టు ఫీలింగ్‌. బాస్‌ మెచ్చుకోకపోతే అసహనం. ‘ఇంకా కొంచెం చేస్తేనే సరిపోతుంది’ అనే ఆలోచన.
రాహుల్‌ ఒకరోజు నా దగ్గర చెప్పాడు… ”నేను ఫెయిల్‌ అయితే, ఎవరో ఒకరి జీవితం నాశనం చేసినట్టే అనిపిస్తుంది” అని. ప్రతిదానికీ భయం.. ఇది నా జీవితం కాదు నాకు చనిపోవాలని ఉంది….
అది నిజానికి రాహుల్‌ భయం కాదు. అది అతని తండ్రి జీవించలేకపోయిన జీవిత భారం. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక సాధారణంగా ఇలా ఉంటారు. వారు చాలా కష్టపడతారు. బాధ్యతలను వెంటనే తీసుకుంటారు. అందరి అంచనాలను తీరుస్తారు. కానీ లోపల మాత్రం తప్పు చేయడానికి భయపడతారు. ‘లేదు’ అని చెప్పలేరు. ఎంత చేసినా ‘ఇంకా సరిపోలేదు”అనే భావన వెంటాడుతుంది. ఇలాంటి వాళ్లే మన ఆఫీసుల్లో ఉన్న హై పెర్ఫార్మర్లు. బయటికి బలంగా కనిపిస్తారు, లోపల మాత్రం అలసిపోయి ఉంటారు.
కేస్‌ స్టడీ: ఒక ఎడ్యుకేషన్‌ టెక్‌ బ్రాండ్‌
ఒక ప్రముఖ ఎడ్యుకేషన్‌ కోచింగ్‌ బ్రాండ్‌ తమ యాడ్స్‌లో ఇలా చెప్పేది… ”ఈ కోర్స్‌ తీసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.”
యాడ్స్‌లో ఎప్పుడూ: భయపెట్టే ర్యాంక్స్‌.. ”లాస్ట్‌ ఛాన్స్‌”.
టాపర్స్‌ మాత్రమే చూపించడం
ఫలితం ఏమైంది?
– తక్కువ సమయంలో భారీ అడ్మిషన్స్‌
– కానీ అధిక డ్రాప్‌అవుట్స్‌
– పేరెంట్స్‌లో ఆందోళన
– పిల్లల్లో గిల్ట్‌, స్ట్రెస్‌
ఒక సర్వేలో చాలా మంది పేరెంట్స్‌ ఇలా చెప్పారు… ”మా పిల్లలు నేర్చుకోవడం కాదు, భయపడడం మొదలుపెట్టారు.”
బ్రాండ్‌ అమ్మింది కోర్స్‌ కాదు, భయాన్ని. అది టాక్సిక్‌ పేరెంట్‌ చేసే పనికే సమానం.
ఈ కేస్‌ స్టడీ మనకు ఏమి నేర్పుతుంది? తల్లిదండ్రులు పిల్లలపై తమ అసంపూర్ణ కలల బరువు పెడితే పిల్లలు భయంతో పెరుగుతారు. బ్రాండ్లు కస్టమర్లపై భయం, గిల్ట్‌, స్టేటస్‌ ఒత్తిడి పెడితే కస్టమర్లు అలసిపోతారు. షార్ట్‌ టర్మ్‌లో, సేల్స్‌ పెరుగుతాయి. లాంగ్‌ టర్మ్‌లో నమ్మకం తగ్గుతుంది. విలువైన సంబంధం చెడిపోతుంది.
ఆరోగ్యకరమైన మార్గం ఏది?
మంచి తల్లిదండ్రులు ఇలా అంటారు.. ”నీ ప్రయత్నం చాలు. ఫలితం మీద కాదు, నీ మీద నాకు నమ్మకం ఉంది.”
మంచి బ్రాండ్లు కూడా ఇలా చెబుతాయి… ”ఇది నీకు సరిపోతుందో లేదో నీవే నిర్ణయించుకో. మేము స్పష్టంగా చెబుతాం.”
స్వేచ్ఛ ఇచ్చిన చోటే నమ్మకం పుడుతుంది. నమ్మకం ఉన్న చోటే దీర్ఘకాల సంబంధం నిలుస్తుంది.
మీరు తల్లిదండ్రులైనా, లీడర్లైనా, బ్రాండ్‌ నిర్మించేవారైనా… ఒక ప్రశ్న మీరే మిమ్మల్ని అడగండి: ”నేను ఎవరో జీవించలేకపోయిన జీవితాన్ని ఇతరుల చేత మోయిస్తున్నానా?”
లేదంటే, ”వాళ్లు ఎంచుకున్న జీవితాన్ని
వాళ్లు జీవించేలా చేయడంలో నేను సహాయం చేస్తున్నానా?” భారం మోపడం సులువు. స్వేచ్ఛ ఇవ్వడం కష్టం. కానీ
ల భారం బంధాన్ని చెడగొడుతుంది.
ల స్వేచ్ఛ నమ్మకాన్ని నిర్మిస్తుంది.
ఒక విషయం గుర్తుంచుకోవాలి… మీరు జీవించలేక పోయిన జీవితాన్ని పిల్లలు మోసేలా చేయకండి. వాళ్లు ఎంచుకున్న జీవితాన్ని, వాళ్లు జీవించేలా చేయండి. అదే నిజమైన ప్రేమ. అదే నిజమైన బ్రాండింగ్‌. అదే నిజమైన నాయకత్వం.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -