ప్రేమ శాశ్వతమా? తాత్కాలికమా? అనేది నేటి సమాజంలో చాలా మంది యువతకు వుండే సందేహం. అయితే కొంత మంది ప్రేమ కేవలం పెండ్లికి ముందు మాత్రమే ఉంటుంది. పెండ్లి తర్వాత అలాంటిది ఏమీ ఉండదు, కేవలం సర్దుబాట్లు మాత్రమే అనుకుంటున్నారు. మరి కొంతమంది ప్రేమ అనేది పెండ్లికి ముందు ఒకలా వుంటే తర్వాత దాని రూపం మారిపోతుంది అంటారు. పెండ్లికి ముందు కంటే కూడా తర్వాతే నిజమైన ప్రేమ ఉంటుందని, అది రోజురోజుకు పెరుగుతుందని నమ్మే వాళ్ల కూడా ఉన్నారు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా పెండ్లి తర్వాత భార్యాభర్తలు ఒకరిపై ఒకరు చూపించే ప్రేమలో ఎలాంటి మార్పు ఉంటుందో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
స్వాతికి సుమారు 27 ఏండ్లు ఉంటాయి. ఆమెకు వంశీతో రెండేండ్ల కిందట పెండ్లి జరిగింది. ఇద్దరూ ప్రేమించుకుని ఇరువైపు కుటుంబాలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఆరు నెలల పాప ఉంది. ఇంట్లో మొత్తం ఐదుగురు ఉంటారు. వంశీ వాళ్ల అమ్మానాన్నతో పాటు అతని చెల్లి కూడా ఉంటుంది. ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో వంశీ, స్వాతిని అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నాడు. ఆమె ఏం అడిగినా ‘మా అమ్మను అడుగు’ అంటున్నాడు. ఇలా ప్రతి చిన్న విషయానికి అత్తను అడగటం ఆమెకు నచ్చడం లేదు.
ఆ ఇంట్లో తనకు విలువ లేకుండా పోయింది అని ఆమె భావన. ఇలాంటి పరిస్థితుల్లో భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదు అంటూ ఐద్వా దగ్గరకు వచ్చింది. మేము ఫోన్ చేసి వంశీని పిలిపించాం. అతను చెప్పింది ఏమిటంటే ‘మేమిద్దరం ఐదేండ్లు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ పెండ్లి చేసుకున్నాం. అలాంటిది ఇంకో అమ్మాయితో సంబంధం ఎలా పెట్టుకుంటాను? పాప పుట్టిన తర్వాత ఆమెకు ఆపరేషన్ జరిగింది కాబట్టి డాక్టర్ కొన్ని రోజులు మా ఇద్దరినీ దూరంగా ఉండమన్నారు. అందుకే స్వాతికి నేను కాస్త దూరంగా ఉంటున్నాను. ఆ మాత్రం దానికే నాపై అనుమానం పెంచుకుంటే ఎలా?
నేను ఉదయం ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు అంటే పాప లేదు కాబట్టి స్వాతితో ఎక్కువ సమయం గడిపే వాడిని. ఇప్పుడు ఇంటికి రాగానే పాపతో కాసేపు ఆడుకుంటున్నాను. తర్వాత స్వాతితో కాసేపు మాట్లాడతాను. దానికే ఆమె ‘నువ్వు పూర్తిగా మారిపోయావు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు’ అంటుంది. నాకు ఆమెపై ప్రేమ లేకపోతే రాత్రంతా పాపను ఎందుకు చూసుకుంటాను. పాప ఏడ్చినా నేనే చూసుకుంటాను. స్వాతిని నిద్రలేపను. పగలంతా తనే పాపను చూసుకుంటుంది. కనీసం రాత్రి పూట అయినా తనకు విశ్రాంతి ఇవ్వాలనే నేను పాపను చూసుకుంటున్నాను.
ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత కూడా రెండు మూడు సార్లు ఫోన్లు చేస్తాను. ఇంతకు ముందు ఆమె ఫోన్ చేసి ‘రా’ అన్న వెంటనే ఇంటికి వెళ్లిపోయేవాడిని. అప్పుడు నాకు ఎలాంటి బాధ్యతా లేదు. కానీ ఇప్పుడు అలా కాదు నాకు స్వాతితో పాటుగా పాప బాధ్యత కూడా ఉంది. ఆఫీసుకు వెళ్లని రోజు నేను ఆమెతోనే ఉంటున్నాను. డెలివరీ తర్వాత మూడు నెలలు స్వాతి వాళ్ల అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఆఫీసుకు సెలవు పెట్టి కొన్ని రోజులు ఉన్నాను. తర్వాత వీక్ ఆఫ్ అప్పుడు అక్కడికే వెళ్లేవాడిని.
ఇంతకు మించి నేనేం చేయాలి. 24గంటలు ఆమెతోనే ఉండాలంటే కుదరదు కదా! నేనేం చెప్పినా స్వాతి అపార్థం చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే ప్రేమ తగ్గింది నాకు కాదు, ఆమెకే నాపై ప్రేమ తగ్గింది. నేను మాట్లాడినా అసలు నాతో మాట్లాడటం లేదు. ప్రతి దానికి చిరాకు పడుతుంది. నేను కదా మీకు కంప్లెయిట్ ఇవ్వాలి. అలాంటిది ఆమెనే మీ దగ్గరకు వచ్చింది. పాప చిన్నగా వుంది కాబట్టి బయటకు తీసుకువెళ్లడం లేదు. ఐస్‌క్రీంమ్‌లు, చాక్లెట్లు తీసుకురావడం లేదు. అవి తింటే పాపకు జలుబు చేస్తుంది. అయినా ఓ 15 రోజుల ముందు పాపను తీసుకొని సినిమాకు వెళ్లాం. హాల్లో సౌండ్‌కి పాప బాగా భయపడింది. ఏడుస్తానే వుంది. దాంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశాము. పాపను మెల్లగా అమ్మ వాళ్లకు అలవాటు చేస్తే బాగుంటుందంటే ‘నన్ను పాపకు దూరం చేయాలని చూస్తున్నారా’ అంటూ గొడవ చేస్తుంది.
ఇప్పుడు ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా పాప గురించి ఆలోచిస్తున్నాను. అది ఆమెకు తప్పుగా అనిపిస్తుంది. మీరే చెప్పిండి.. పిల్లలు వచ్చిన తర్వాత అంతకు ముందులా ఉండడం సాధ్యమేనా? ఆమె ఎంతో బాధను అనుభవించి నన్ను తండ్రిని చేసింది. అలాంటప్పుడు నేను తనని ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు స్వాతిపై ప్రేమ ఉంది. దాంతో పాటు గౌరవం, బాధ్యత కూడా ఉన్నాయి. ఇదంతా స్వాతికి అర్థం కావడం లేదు. పైగా ఇప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చింది. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి’ అన్నాడు.
మేము ఇద్దరినీ కూర్చోబెట్టి ‘డెలివరీ తర్వాత హర్మోన్ల ప్రభావంతో మహిళల్లో కొన్ని మార్పులు వస్తాయి. కారణం లేకుండానే చిరాకు, కోపం, బాధ వస్తాయి. అందుకే ఆమె మీతో అలా ఉంటుంది. మీరే కాస్త అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్న మీరు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పెండ్లికి ముందు, పెండ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వయసు పెరుగుతున్న కొద్ది కొన్ని మార్పులు సహజం. అవన్నీ బాధ్యత వల్ల వచ్చినవే తప్ప ప్రేమ లేకపోవడం వల్ల కాదు. ఇది ఇద్దరూ అర్థం చేసుకోవాలి.
స్వాతితో ‘చూడు నీ భర్త నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ పట్ల బాధ్యతగా ఉంటున్నాడు. పాపను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నీ భర్తకు నీపై ప్రేమ తగ్గలేదు. కాకపోతే అది చూపించే విధానంలో మార్పు వచ్చింది అంతే. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని రాత్రంతా పాపను చూసుకుంటున్నాడు. ఇదంతా నీపై ఉన్న ప్రేమతోనే చేస్తున్నాడు. అది అర్థం చేసుకొని నువ్వు కూడా పాపతో సంతోషంగా ఉండు. ఇక పాపను మీ అత్త వాళ్లకు దగ్గర చేయడం చాలా మంచిది. పిల్లలు అమ్మమ్మలు, నాయనమ్మల దగ్గర పెరిగితే చాలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటారు. అంతే కాకుండా నువ్వు నీ భర్తతో కాస్త సమయం గడపటానికి కూడా అవకాశం ఉంటుంది’ అని చెప్పి పంపించాము.



