Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మామిడి 'పండు'తుందా.?

మామిడి ‘పండు’తుందా.?

- Advertisement -

ఆశాజనకంగా పూత
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని తాడిచెర్ల, రుద్రారం, కాపురం గ్రామాల్లో దాదాపుగా 300 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈసారి పూత ఆశాజనకంగా ఉండడంతో మెరుగైన దిగుబడి వస్తుందని రైతులు భావిస్తున్నారు. చీడపీడల నుంచి పూతను కాపాడుకునెలా రైతులు ప్రయత్నాలు చేస్తున్నాయి. మామిడిచెట్లకు పూత గణనీయంగా వచ్చిం ది. ఇందులో సగమైనా కాతగా మారితే దిగుబడికి డోకా ఉండదని, లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఈ మేరకు నాలుగేళ్ల నుంచి నష్టాలు తప్ప లాభమన్నది ఎరగని రైతులు..పూత,పిందెను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తూ తోటల్లో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే పలుచోట్ల తోటలను లీజ్కు తీసుకున్న వ్యాపారులు మామిడితోటల్లో చీడ పీడల నివారణ చర్యలు చేపడుతున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే తోతాపురి, బంగినపల్లి తదితర మామిడి రకాలు మండలంలో సాగవుతున్నాయి.అయితే,మామిడి సాగు వ్యయం పెరుగుతుండడం..చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వస్తుండడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలుచోట్ల మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రారంభించారు.

పూత దశలో ఏటా తేనె మంచుపురుగు, తామర పురుగు ఉధృతితో పెట్టుబడి పెరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని, ఒకవేళ కాయ దశకు చేరినా మంగు తెగులుతో నష్టాలు, దీన్ని అధిగమించే సరికి ఈదురు గాలులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని, ఇవన్నీ ఓర్చుకుంటూ కాత వచ్చేసరికి మామిడి మార్కెట్ లేక మంచి ధర కోసం దక్షిణాది రాష్ట్రాల వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదని రైతులు, గుత్తేదారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -