– నగరంలో కాలుష్యకారక కంపెనీలు
– ఔటర్ వెలుపలకు తరలించేందుకు సర్కార్ కసరత్తు
– ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం దిశానిర్దేశం
– ఇటీవల మరోసారి మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
– రెండుసార్లు ప్రక్రియ వాయిదా.. మూడోసారి ప్రయత్నం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామిక వాడలు కాలుష్యపు జాడలుగా మారాయి. నగరవాసిని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్ముందు ఢిల్లీ తరహా సమస్య ఏర్పడుతుందేమోనన్న భయాందోళనలూ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య కారక పరిశ్రమలను నగర శివారులోకి తరలించాలనే ప్రతిపాదన మరోసారి తెర మీదికొచ్చింది. కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ కూడా తాజాగా తరలింపు ప్రక్రియ వేగవంతం కాకపోవడం పట్ల కాలుష్య నియంత్రణ మండలిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను నగరం నుంచి తరలించాలనే ఆలోచన ఇప్పటిదేం కాదు. ఏండ్ల నుంచి ఈ వాదన వినిపిస్తూనే ఉన్నా.. అమల్లో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. కాలుష్యకారక పరిశ్రమలను నగర శివారులోకి తరలించాలని 2012లో అప్పటి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రాజకీయ, వ్యాపారవేత్తలతోపాటు మరికొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు అనుగుణంగా అప్పటి కేసీఆర్ సర్కార్ కూడా కసరత్తు చేసింది. అయితే, పారిశ్రామికవేత్తల లాబీయింగ్ పరిశ్రమల తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేసింది. కాలుష్య ఉద్గారాలను వెదజల్లు తున్న పరిశ్రమలు జనావాసాల్లో కొనసాగడం శ్రేయస్కారం కాదనీ, మొదట్లో పారిశ్రామికవాడలు శివార్లలో ఉన్నప్పటికీ నగరీకరణ నేపథ్యంలో అక్కడా కాలనీలు వెలిసినందున వీటి తరలింపు అనివార్యమనీ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రసాయనిక కంపెనీలను నగరానికి ఆవల.. సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో భూములను సేకరిం చి, పారిశ్రామికవాడలుగా అభివృద్ధి చేశారు. పరిశ్రమలకు ప్లాట్లను కూడా కేటాయించారు. కానీ, భూములు తీసుకున్న పరిశ్రమలు అక్కడికి తరలివెళ్లకుండా తమ కార్యకలాపాలను నగరంలోనే కొనసాగిస్తున్నాయి.
వ్యర్థ జలాల నిర్వహణ అధ్వానం
ఔటర్ రింగ్ రోడ్డు లోపల వేల సంఖ్యలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయి. జీడిమెట్ల, కాటేదాన్, బొల్లారం, బోలక్‌పూర్, చర్లపల్లి, లింగంపల్లి, మేడ్చల్, ఉప్పల్, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల్లో బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, తోళ్ల పరిశ్రమ, ఐరన్, స్టీల్ వంటి భారీ పరిశ్రమలతోపాటు పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరికొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులు, కార్మికులు, ఉపాధి కోసం వివిధ వర్గాలకు చెందిన వారు స్థిర నివాసం ఏర్పర్చు కున్నారు. దీంతో ఆ ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపో తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం తో జనాలు రోగాల బారిన పడుతున్నారు. వ్యర్థ జలాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. సాధారణ మురుగు కాలువల్లో ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలను విడిచి పెడుతుండటం స్థానికులకు సంకటంగా మారింది. స్థాని కుల నుంచి ఫిర్యాదు వస్తేనే పీసీబీ అధికారులు చర్యలకు ఆదేశిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మూసేయాలని చెప్పినా, కొన్ని పరిశ్రమలు అనధికారికంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
రెడ్ కేటగిరీ పరిశ్రమలే ఎక్కువ
నగరంలో దాదాపు 2 వేలకు పైగా రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నట్టు అంచనా. ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల్లో సుమారు 2,500 వరకు నగర పరిధిలోనే ఉండొచ్చని అంచనా. వీటిల్లో ఇప్పటి వరకు సుమారుగా 40 శాతం కంపెనీలను ఇతర ప్రాంతాలకు తరలించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బోలక్‌పూర్‌లోని తోళ్ల పరిశ్రమను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు, ఇనుము, స్టీల్ పరిశ్రమలను వికారాబాద్ జిల్లా రాకంచర్లకు, నూనె తయారీ పరిశ్రమలను సంగారెడ్డి జిల్లాకు తరలించగా.. జహీరాబాద్ సమీపంలో టీజీఐఐసీ మౌలిక వసతులను అభివృద్ధి చేసి, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ఆసక్తి ఉన్న పరిశ్రమలకు ఆయా ప్రాంతాల్లో స్థలాలను కేటాయించారు. కొంత కాలం వేచి చూసి మీరు వెళ్లకపోతే ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించినా పరిశ్రమల యాజమాన్యాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ప్రక్రియ ముచ్చటగా మూడోసారి తెరపైకి వచ్చింది. మరి ఈసారైనా ఈ హానికర కంపెనీలు నగరం దాటుతాయో..? లేదో వేచి చూడాలి..!
‘కాలుష్యం’ కదిలేనా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES