కేంద్రం తీరుపై ఆమ్రారామ్ ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో వ్యవసాయ రంగం గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజస్థాన్లోని సికార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఎంపీ ఆమ్రారామ్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో మంగళవారం ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం కోరలు చాచిందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని, ఆదివాసీల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం కూడా వ్యవసాయ రంగం ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేదన్నారు. నాడు ఆంగ్లేయులు, భూస్వాములు దోపిడీలకు పాల్పడినా..ఇంతటి దయనీయమైన స్థితిలో రైతులు లేరని, దోపిడీ విధానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హాయంలో ఆత్మహత్య చేసుకోవడం మినహా అన్నదాతలకు మరో మార్గం కనిపించడం లేదన్నారు.
ఖనిజాల కోసం ఆదివాసీల హక్కుల హననం
కేంద్ర ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రులకు చెందిన కంపెనీలకు అటవీ సంపదను దోచిపెడుతోందని, ఇందుకోసం ఆదివాసీల హక్కులను హరించివేస్తోందని ఆమ్రారామ్ విమర్శించారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో అత్యధిక ఖనిజ సంపద కొల్లగొట్టేందుకోసం రాజ్యాంగం వారికి కల్పించిన ‘పెసా’ చట్టాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు దక్కాల్సిన భూములను కేంద్రం అక్రమంగా గుంజేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ)లో విద్యార్థి సంఘ నాయకులపై 11 ఏండ్లుగా దేశద్రోహం కేసులు బనాయించి వేధిస్తున్నారని, పేద విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. ఆమ్రారామ్ మాట్లాడుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలోనే ఉన్నారు. దేశంలో ఆర్థిక అసమానతల పెరిగిపోతున్నాయని, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కీలక అంశాలపై సభలో చర్చ చేపట్టాలని ఆమ్రారామ్ డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అందుకు తిరస్కరించారు. నిబంధన 193 కింద కేటాయించిన అంశాలకే పరిమితం కావాలన్నారు.
వ్యవసాయ సంక్షోభం పట్టదా?
- Advertisement -
- Advertisement -



