అనాదిగా మనిషికి, అత్యంత స్నేహపూర్వక, విశ్వాసపాత్రమైనదిగా ప్రసిద్ధికెక్కి, కుటుంబంలో ఒక ముఖ్య సభ్యత్వ స్థానం పొందగలిగే ఏకైక జంతువు కుక్క. జంతువులెన్నిటితోనో మనిషికి బాంధవ్యం ఏర్పడవచ్చు, కానీ శునకంతో సాన్నిహిత్యం ప్రత్యేకమైనది. కారణం-దాని ప్రేమ ఏ నిబంధనలూ, షరతులతో కూడి లేనిది. అలాంటి జంతువు మనిషిని ఎందుకు కరుస్తుంది? అదీ ప్రాణాంతకంగానా?
మన దేశంలో కుక్క కాటు, రేబిస్ సంబంధిత మరణాలు కాలక్రమేణా పెరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. అన్ని ప్రాణుల్లాగే కుక్కల్లో కూడా ఎన్నో జాతులు, అన్నీ విలక్షణంగా ఉంటాయి. పెంపుడు కుక్కలు, శిక్షణ పొందినవి కూడా అరుదుగా యజమానిపై దాడి చేసినట్టుగా వార్తలు వస్తుంటాయి. గత సంవత్సరం గణాంకాల మేరకు హైద్రాబాదులోనే రోజుకు సగటున వందకు పైగా, తెలంగాణ రాష్ట్రంలో మూడువందలకు పైగా కుక్కకాటు కేసులు, దేశం మొత్తమ్మీద ముప్ఫయి మిలియన్లకు పైగా అంటే రోజుకు సగటున పదివేల కేసులు, వాటిల్లో యాభై నాలుగు రేబిస్ మరణాలుగా నమోదైనట్టు అధికారిక గణాంకాల రికార్డులు చెప్తున్నాయి.
కుక్క కరవడానికి ప్రధాన కారణాలు:
ఆటలో భాగంగా, భయంతో, నొప్పివలన, ఒత్తిడిలో, స్వీయ రక్షణ చర్యలో భాగంగా, అనారోగ్యంతో చికాకు కలిగి, ఆకలి, వాటి పిల్లల్ని రక్షించుకొనే క్రమంలో, శిక్షణ-, వ్యాయామం లేని అలసత్వం, తన ప్రాంత రక్షణ, లైంగిక భావోద్వేగం, నిద్రలోనుండి హఠాత్తుగా లేచినప్పుడు ఉలిక్కిపడే-బెదిరే ప్రతిస్పందనలో భాగంగా, ఇలా పలు కారణాల వల్ల కుక్క మనుషుల్ని కరవొచ్చు. రేబిస్ వ్యాధి సోకిన కుక్క (రేబీడ్) అకారణంగానే కరుస్తుంది.
ఎవరు ఎక్కువగా కుక్క కాటుకు గురౌతుంటారు?
ఊర కుక్కలు తిరిగే చోట బయట పడుకోబెట్టిన పసికందులు, వాటితో ఆడుకొనే చిన్నపిల్లలు, పొద్దున్నే నడకకు బయల్దేరిన ఒంటరి వ్యక్తులు, దూసుకుపోతున్న ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న వారు/ నడిపేవారు, పార్కులో ఆడుకొనే పిల్లలు, అప్రమత్తంగా లేని ఎవరైనా కుక్కల ఉన్మాదానికి గురవ్వవచ్చు.
కుక్కకాటు పర్యవసానాలు:
గాయం: ఊరకుక్కయినా, పెంపుడు కుక్కైనా, దాని కాటు వల్ల అయ్యే గాయం తీవ్రత- కాటు కాకుండా చర్మ స్పర్శ మాత్రమే సంభవించిందా, చర్మం తొలిగిందా, గాయమైందా, రక్తస్రావమైందా, లోతుగా పళ్ళు దిగాయా, ఎంత ఉధతంగా దాడి చేసిందీ, పలు చోట్ల గాయాలయ్యాయా, కాళ్ల పైనా, చేతుల పైనా, ముఖంపైనా వంటివి పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.
కుక్కకాటు విషయంలో అతి ప్రమాదకరమైన పర్యవసానం రేబిస్ అనే వైరల్ వ్యాధి. ఇది చాలా భయంకరమైనది, చికిత్సకందనిది, ప్రాణాంతకమైనది.
కుక్క రేబీడ్ కాకపోయినా కూడా, అది చేసిన గాయాల వల్ల ధనుర్వాతం (టెటనస్), ఇతర చీముతో కూడిన ఇన్ఫెక్షన్లు రావచ్చు. చికిత్స చేయకపోతే అపాయకరం కావచ్చు.
రేబీడ్ కుక్కను గుర్తించడమెలా?
రేబీడ్ కుక్క, వ్యాధి వాహకంగా మారిపోయి తన లాలాజలంలో రేబిస్ వైరస్‌ని స్రవింపచేస్తుంది. కరిచినప్పుడు దాని లాలాజలంతో బాటు ఈ వైరస్ మనిషి శరీరంలోనికి చొచ్చుకొని పోతుంది.
కుక్కల్లో రేబిస్ రెండు రకాలుగా ఉండొచ్చు.
ఒకటి: నిశ్శబ్ద రేబిస్-కుక్క. తిండికి-నీటికి దూరంగా, ముడుచుకొని, నిస్తేజంగా ఒక మూల పడుకొని ఉంటుంది. దాని నోటినుండి లాలాజలం ఊరుతూ ఉండవచ్చు.
రెండోది: తరుచుగా చూసేది- గుర్రుగా చూస్తూ దాడికి సిద్ధంగా ఉండేది.
సాధారణంగా, రేబీడ్ కుక్క, వ్యాధి సోకిన పది రోజుల్లో చనిపోతుంది.
మనుషుల్లో రేబిస్ జబ్బు లక్షణాలు:
రేబిస్ జబ్బు లక్షణాలు బయటపడడానికి పది-ముఫై రోజులు-మూడు మాసాలు పట్టొచ్చు. అరుదుగా ఒక సంవత్సరం లేదా పలు సంవత్సరాలు కూడా పట్టిన సందర్భాలు నమోదయ్యి ఉన్నాయి.
జ్వరం, తలనొప్పి, అలసట, కండరాల బలహీనత వంటి సూచికలతో మొదలయ్యి, తీవ్రమైన నాడీసంబంధిత దశకు చేరుకొని, ఆదుర్దా, చిరాకు, అమితమైన భయాందోళనలు, మాట రావకపోవడం, గందరగోళంగా అనిపించడం, ఎక్కడో ఉన్నట్టు, లేనివి ఏవో కనిపించడం, భ్రాంతిలోకి వెళ్లిపోవడం, నీరు చూసినా, నీటి శబ్దం వినిపించినా, గాలి వీచినా, అమితంగా ఆదుర్దా చెందడం, ఏమీ తినలేరు, తాగలేరు. ఎవరితో మాట్లాడలేరు!
పిచ్చి చూపులతో, కలవరంలోనే, అతి దీనావస్థలో కొద్దీ రోజులు నరక ప్రాయంగా గడిపి, మూర్ఛలు-పక్షవాతం రావడం, చివరికి చనిపోవడం జరుగుతుంది. అనుభవించేవారికి నరకమే! చూసేవారికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
అందుకే, కుక్క కాటుకు అంతగా భయపడేది!
కుక్కలే కాకుండా, అరుదుగా గబ్బిలాలు, పిల్లులు, తోడేళ్ళు, ముంగిసలు, ఉడుములు కూడా తమ కాటు ద్వారా రేబిస్ వ్యాధిని మనుషులకు వ్యాపింపచేయవచ్చు.
నివారణ ఎలా?
మనుషులనే కాదు కుక్కల్ని, ఇతర జంతువుల్ని కూడా రేబిస్ నుండి రక్షించే విధంగా వైద్య ప్రణాళికలు రూపొందించబడి ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలులో పెట్టాలి. దీనికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం.
కుక్కలను పెంచుకొనే వారు, వాటికి యాంటీరేబిస్ టీకాలు తప్పనిసరిగా, నియమానుసారం, పశువైద్యుల సంప్రదింపుతో చేయిస్తూ ఉండాలి.
ఊరకుక్కలను, అవి జీవించడానికి తగు సదుపాయాలు ఉన్న సంరక్షణ కేంద్రాలకు తరలించి, సుశిక్షిత సిబ్బంది పర్యవేక్షణలో ఉంచడం, వాటిని దత్తతకిచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, కుక్కల జనాభా నియంత్రణ పథకాలు నిరంతరం సఫలీకతమయ్యే విధంగా అమలులో పెడుతూ ఉండడం, ఏ కుక్కలోనైనా అసాధారణ ప్రవర్తన మొదలైతే, వెంటనే వాటిని వైద్య పర్యవేక్షణలో పెట్టగలిగే వెసులుబాటు కల్పించడం వంటివి ప్రభుత్వపరమైన బాధ్యతలు.
అంతే కాకుండా, యాంటీరేబిస్ వాక్సిన్, ఇమ్మ్యూనోగ్లోబులిన్స్, టీటీ ఇంజెక్షన్లు, అంటిబయోటిక్స్ విరివిగా అన్ని ఆసుపత్రులలో లభించేటట్టుగా, వాటిని తగు రీతిలో వాడగలిగే సిబ్బందిని ఏర్పాటు చేయడం చాలా అవసరం.
కుక్కలతో పాటుగా మనుషలకు కూడా రేబిస్ రాకుండా టీకా (ప్రీ ఎక్సపోషర్ ప్రోఫీలాక్సిస్) ఇవ్వాలి.
రేబిస్ రాకుండా కాపాడుకోవడం ఎలా?
కుక్కకాటు తరువాత, అది రేబీడ్ కుక్కైతే, వెంటనే గాయానికి చికిత్స, వాక్సినేషన్ తీసుకోకపోతే ఎప్పుడైనా రేబిస్ రావచ్చు
నియమానుసారం వాక్సినేషన్ పొందినా, వాక్సిన్ సరైన వాతావరణంలో భద్రపరచనిదయ్యుంటే, మనిషికైనా, కుక్కకైనా రక్షణ లభించదు.
పోస్ట్ ఎక్సపోషర్ ప్రోఫీలాక్సిస్:
ఎటువంటి కుక్క కాటుకైనా ఇది తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే గాయాల్ని సబ్బునీళ్లతో క్షుణ్ణంగా కడిగి, శుభ్రపరచాలి. గాయానికి కట్టు కట్టకూడదు.
కనీసం ఐదు మోతాదులు, గాయమైన రోజు (0), 3, 7, 14, 28 రోజుల్లో యాంటీరేబిస్ వాక్సినేషన్, ఆసుపత్రిలో, కండరంలోకి ఇస్తారు. ఆంటీ రేబిస్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ మోతాదు నిర్ణయించి, కొంత గాయంలోనికి, కొంత కండరానికి ఇస్తారు.
ఈ వెసులుపాటు ప్రభుత్వాదేశాలనుసారం అన్ని ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులో ఉన్నది.
డాక్టర్ మీరా,
రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,
ఫీవర్ హాస్పిటల్ /ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.