నవతెలంగాణ-హైదరాబాద్: ఎట్టకేలకు టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. సరిహద్దులో ఇటీవల జరిగిన పోరాటంలో అనేక మంది మరణించగా, వందలాది మంది గాయపడిన తర్వాత ఈ చర్చలు జరిగాయి.
కాబూల్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ నాయకత్వం వహించారని, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రతినిధులతో చర్చలలో పాల్గొన్నారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.
కానీ.. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పాటిస్తుందా..? ఎప్పటి లాగానే విరమణను ఉల్లంఘిస్తుందా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.