ఒక్క రోజే 82 పైసలు క్షీణత
చరిత్రలోనే ఆల్‌టైం కనిష్టం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ అధోపాతాళానికి పడిపోయింది. శుక్రవారం అమెరికన్ డాలర్‌తో పోల్చితే 82 పైసలు లేదా 1 శాతం క్షీణించి 93.71కి పడిపోయింది. ఇది భారత చరిత్రలోనే అత్యంత పేలవ, కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంతర్జాతీయ పరిణా మాలకు తోడు దేశీయంగా పలు ప్రతికూలాంశాలు రూపాయి విలువ ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపడం రూపీని బలహీనపర్చింది. రూపాయి విలువ 93 మార్కును దాటడం అనేది కేవలం ఒక సంఖ్య కాదని.. ఇది ప్రజల కొనుగోలు శక్తిని అమాంతం హరించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా భారత్ తన చమురు అవసరాలలో 80 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. దిగుమతి ద్రవ్యోల్బణం వల్ల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతాయి. అదే విధంగా ఎగుమతుల కంటే దిగుమతుల విలువ పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ (సీఏడీ) అమాంతం పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలు కరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయనుంది. అంతిమంగా దేశ అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా మారనుంది.
తడిసి మోపేడే..!
రూపాయి పతనం వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను తరలించుకుపోతారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే అవకాశం ఉంది. విదేశీ రుణాలు తీసుకున్న భారతీయ కంపెనీలకు వడ్డీ భారం పెరగడంతో పాటు.. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. రానున్న రోజుల్లో రూపాయి విలువ 93.80 స్థాయికి కూడా పడిపోవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ అనలిస్ట్ అనుజ్ చౌదరి అంచనా వేశారు. ముడిచమురు బ్యారెల్ 110 డాలర్లు దాటడం, రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు భారత ఆర్థిక ఆర్థిక వ్యవస్థను మందగించేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



