Tuesday, March 31, 2026
E-PAPER
Homeబీజినెస్డాలర్‌ @95

డాలర్‌ @95

- Advertisement -

అత్యంత అధ్వానస్థితిలోకి రూపాయి
ఆర్బీఐ, మోడీ సర్కార్‌ విఫలమంటూ విమర్శలు


ముంబయి : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో రూపాయి పతనం రోజుకో నూతన రికార్డు కనిష్టాన్ని సృష్టిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి మారకం విలువ భారత చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో పోల్చితే 95 మార్క్‌ను దాటి అత్యంత అధ్వానస్థితికి పడిపోయింది. సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌లో 93.62 వద్ద రూపాయి విలువ తెరుచుకుంది. ఆ తర్వాత 165 పైసలు పతనమై 95.20 కనిష్టం వద్ద నమోదయ్యింది. తుదకు 94.78 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో రూపాయి విలువ ఏకంగా 10 శాతం పైగా పడిపోయింది. ఫిబ్రవరిలో 90.98 వద్ద ఉన్న రూపాయి.. ప్రస్తుతం 95 స్థాయిని తాకి నూతన కనిష్టానికి పడిపోయింది.

దీంతో రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీజేపీ సర్కార్‌ విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత కరెన్సీ ఇదే స్థాయిలో పడిపోతుంటే త్వరలోనే 100 మార్కుకు చేరొచ్చని అంచనాలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లు దాటితే రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత దిగుమతి బిల్లులు పెరగడంతో పాటుగా భారత మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం రూపాయిని బలహీనపరుస్తోంది. భారత కరెన్సీ పతనం ఇలాగే కొనసాగితే పెట్టుబడిదారులలో అభద్రతా భావం పెరిగి మార్కెట్లలో మరింత అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది.

రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి
2025-26 ఆర్థికసంవత్సరపు చివరిరోజైన సోమవారం నాడు కూడా మార్కెట్‌ను యుద్ధభయం వెంటాడింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న వార్తలతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో సెన్స్‌క్స్‌ 1600 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 22,350 పాయింట్లకు దిగువన నష్టపోయింది. మొత్తంమీద 9లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఒక్కరోజులోనే ఆవిరైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -