ట్రంప్ చేష్టలకు వ్యతిరేకంగా పోరాటం..
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – అశ్వారావుపేట
విదేశీ ఉత్పత్తులు భారత దేశంలో దిగుమతి తో స్వదేశీ వ్యవసాయ రంగం కుదేలు అవుతుందని, దీంతో దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం వచ్చి భారతీయ సమాజం అతలాకుతలం అవుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవల మృతిచెందిన సీనియర్ పార్టీ నాయకులు, నందిపాడు మాజీ సర్పంచ్ ఊకే వీరాస్వామి దశ దిన కర్మ సందర్భంగా గురువారం నందిపాడు లో సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల కమిటీ ఆద్వర్యంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అద్యక్షతన నిర్వహించిన సంస్మరణ సభకు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు.
ముందుగా ఊకే వీరస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ “మీ దేశం లోకి పంపిన మా సరుకులు పై పన్నులు విధించ వద్దని” ట్రంప్ అంటున్నాడని,అమెరికా దేశం సరుకులు భారత దేశంలోకి దిగుమతి అయితే మన వ్యవసాయం తీవ్ర సంక్షోభం లో పడే అవకాశం ఉంటుందని తమ్మినేని హెచ్చరించారు.
అమెరికా నుండి పత్తి,సోయా,మొక్కజొన్న,కోడి మాంసం,పాల ఉత్పత్తులు మన దేశంలో కి పంపితే మన దేశం పంటలు కొనే వారే ఉండరని,ఆర్ధిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు. భారత దేశం పై అమెరికా మితిమీరిన వైఖరి,ట్రంప్ చేష్టలు పై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అమెరికా పోకడలు పై మాట్లాడాలని గుర్తు చేసారు. దేశప్రజల విముక్తికి,పెట్టుబడిదారుల దోపిడీ కి,లౌకిక వాద రక్షణకు పోరాడటమే ఊకే వీరాస్వామి కి నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
పార్టీ విధానాలు పట్ల అచంచల విశ్వాసి వీరాస్వామి – పోతినేని సుదర్శన్ రావు
పార్టీ విధాలు పట్ల,ఉద్యమ కీలక సమయాల్లో వీరాస్వామి అచంచల విశ్వాసం ప్రదర్శించే వారని పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.ఆయన చివరి వరకు ఆదర్శ జీవనం గడిపారని,1990 నుండీ తనకు ఆయన జీవన శైలి తెలుసని ఆయనతో ఉన్న సహా చర్యాన్ని గుర్తు చేసుకున్నారు.డీవైఎఫ్ఐ యువజనోత్సవాల్లో తాను ఈ ప్రాంతంలో నిర్వహించిన సందర్భంగా ఎంతో ఉత్సాహం ఉండేవారని తెలిపారు.1995 లో ఈ ప్రాంతంలో కొన్ని విచ్ఛిన్నకర సంస్థలు రైతులను ఇబ్బందులు పెడుతుంటే నాడు ఎమ్మెల్యే గా ఉన్న కుంజ బొజ్జి ని తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని గుర్తు చేసారు.
ఎంతో నమ్రతగా ఉండే వీరాస్వామి ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ధిక్కారం ప్రదర్శించే వారని అన్నారు.ఈ ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు వచ్చాయంటే అది వీరాస్వామి కృషి ఫలితమే నని అన్నారు. వీరాస్వామి ది స్వంతం,స్వార్ధం లేని వ్యక్తిత్వం – జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు స్వంతం,స్వార్ధం లేని వ్యక్తిత్వం తో వీరాస్వామి జీవించారు అని పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు.
గ్రామం అభివృద్ధికి,గిరిజనులు పురోభివృద్ధికి ఎనలేని కృషి చేసారని,పార్టీ విస్తరణకు ఎన్నో ఉద్యమాలకు,పోరాటాలకు నాయకత్వం వహించారు అని అన్నారు.పెద్దల మన్నన లు పొందడమే కాకుండా చిన్న వాళ్ళను సైతం గౌరవించే అరుదైన వ్యక్తిత్వం అని వీరాస్వామి నైజాన్ని ఆయన కొనియాడారు.ఈ ప్రాంతంలో పార్టీ విస్తరించడం,పటిష్ఠ పరచడమే ఆయన కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తెల్లం నాగమణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, అన్నవరపు సత్యనారాయణ,రేపాకుల శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కారం సూరిబాబు,మడిపల్లి వెంకటేశ్వరరావు, ఊకే వీరాస్వామి పెద్దకుమారుడు వెంగళరావు,సమీప బంధువు కారం వీరాస్వామి లు పాల్గొన్నారు.