Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడొద్దు

కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడొద్దు

- Advertisement -

– న్యాయపరంగా అండగా ఉంటాం
– సర్పంచులను వేధిస్తే ఊరుకోం..
– ప్రతి జిల్లాలో ‘లీగల్‌ సెల్‌’ ఏర్పాటు : సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ సర్పంచులకు కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల

”రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదు.. వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడొద్దు..” అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పార్టీ సర్పంచులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ సర్పంచులకు సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని చెప్పారు. ‘మిమ్మల్ని సస్పెండ్‌ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులుగానీ, పాలకపక్ష నేతలుగానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నాం. అర్ధ గంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం’ అని కేటీఆర్‌ అన్నారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండేండ్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సర్పంచ్‌ ఎన్నికల్లో 40 నుంచి 70 శాతం స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్‌ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్‌ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్‌ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. చివరి విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాస్కాబ్‌ చైర్మెన్‌ కొండూరు రవీందర్రావు, సెస్‌ చైర్మెన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ నాలకొండ అరుణ, తుల ఉమా, ఏనుగు మనోహర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -