ఎకరాకు రూ.10వేల పరిహారం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
క్లౌడ్ బరస్ట్‌లపై దృష్టి కేంద్రీకరించండి
కేంద్రం మొండిచేయి చూపిస్తే ఊరుకోం..
వారం రోజుల్లో కలెక్టర్లతో సమావేశం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉమ్మడి వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేసిన సీఎం
హనుమకొండ కలెక్టరేట్‌లో వరదలపై సమీక్ష
సమ్మయ్యనగర్‌లో వరద బాధితులకు ఓదార్పు
”అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం. ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. ఆవులు, గేదెలు చనిపోతే రూ.50వేలు పరిహారం ఇస్తాం. మేకలు, గొర్రెలకు రూ.5వేలు ఇస్తాం. దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులకు రూ.15వేలు ఇస్తాం. రాష్ట్ర విపత్తుకు కేంద్రం మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం. కలెక్టర్లు పంట నష్టంపై తక్షణం నివేదికలు పంపాలి. వారం రోజుల్లో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీల ఆధ్వర్యంలో సెక్రెటేరియట్‌లో సమావేశం ఏర్పాటు చేస్తాం. దానికి కలెక్టర్లు రావాలి. నాలాలు ఆక్రమిస్తే సహించేది లేదు. దానివల్ల కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు తోడుగా ఉంటుంది”
సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/హుస్నాబాద్ రూరల్
అధైర్యపడొద్దని… అండగా ఉంటామని వరద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండ, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్‌లో నీటమునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కల్వర్టులు, వ్యక్తులు గల్లంతయిన ప్రదేశాలను పరిశీలించారు. నష్టాలపై నివేదకలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, కోహెడ, భీమదేవరపల్లి, అక్కన్నపేట, ఎల్కతుర్తి మండలాల్లో జరిగిన మొత్తం నష్టాన్ని రికార్డు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు.
అనంతరం హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్ ప్రాంతాలను సందర్శించి వరద బాధితు లను పరామర్శించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వరదలపై పలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఇందిరాగాంధీ ఛాయాచిత్రం వద్ద నివాళులర్పించారు. తుపాను నష్టంతో పాటు పంట నష్టాలకు సంబంధించి వెంటనే సర్వే చేసి నివేదికలను పంపాలని తెలిపారు. పంట నష్టాల సర్వేల్లో ప్రజాప్రతినిధులను కూడా తీసుకువెళ్లాలని సూచించారు.
ప్రకృతి విపత్తుపై కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నిస్తామని, కేంద్రం మొండిచేయి చూపితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో వెంటనే సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసి జిల్లాల్లో జరిగిన నష్టాలపై నివేదికను రూపొందించాలన్నారు. త్వరితగతిన ప్రిన్సిపల్ సెక్రెటరీల ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించుకోవాలని, అనంతరం వారం రోజుల్లో హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహిస్తామని, ఈ సమావేశంలో నివేదికలతో రావాలని కలెక్టర్లు, ఉన్నత అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తుపాన్ నేపథ్యంలో భారీ వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇండ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆవులు, గేదెలు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని, క్లౌడ్ బరస్ట్‌లపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ విపత్తు తాత్కాలిక మేనని తేలిగ్గా తీసుకోవద్దని, తరుచూ వచ్చే అవకాశముందని, దీనికి పరిష్కారం కనుగొనాలని అన్నారు.
సీఎం హడావుడి పర్యటన.. ఉసూరుమన్న బాధితులు
సీఎం రేవంత్‌రెడ్డి రాక కోసం గంటలతరబడి వేచి చూస్తే కనీసం తమ గోడు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదని వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండ నగరంలోని సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మయ్యనగర్‌లో కొద్దిమంది బాధితులతో మాత్రమే సీఎం మాట్లాడారు. అయితే మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం రావాల్సి ఉండగా, ఏరియల్ సర్వే ముగించుకొని 3.00 గంటలకు వచ్చారు. తొలుత సమ్మయ్యనగర్‌కు వెళ్లిన ఆయన అక్కడ భారీగా వేచిచూస్తున్న బాధితులను పరామర్శించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అంబేద్కర్ భవన్ రోడ్డులో బ్రిడ్జి వద్దకు వచ్చి వరదను పరిశీలించి అక్కడి నుంచి కాపువాడ, పోతననగర్‌కు వెళ్లారు. అక్కడ ఎవరినీ పరామర్శించకపోవడంతో బాధితులు ఉసూరుమ న్నారు. కాపువాడకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి భద్రకాళి చెరువు మత్తడిని కారులో ఉండే పరిశీలించి అక్కడి నుంచి నేరుగా పోతననగర్‌కు వెళ్లారు. పోతననగర్‌లో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి ముంపు పరిస్థితిని సీఎంకు వివరించారు. గంటల తరబడి సీఎం కోసం వేచి చూసినా మా బాధ చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సీఎం పర్యటనలో భారీ బందోబస్తు నేపథ్యంలో వరద బాధితులు సీఎం వద్దకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
నాలాల్లో కబ్జాలు తొలగించాల్సిందే..
నాలాల్లో కబ్జాలుంటే వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగరం స్మార్ట్‌సిటీ పథకానికి గడువు పెంచేలా అనుమతి తీసుకొచ్చామని, స్మార్ట్ సిటీ కింద ఎన్ని పనులు పూర్తి చేశారో నివేదిక ఇవ్వాలన్నారు. వరంగల్, హనుమకొండ నగరాలకు సంబంధించి మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్, విప్ డాక్టర్ రాంచందర్ నాయక్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఉన్నతాధికారులు అరవింద్‌కుమార్, రాహుల్ బొజ్జా, స్టీఫెన్ రవీంద్ర, ఈ. శ్రీధర్, 12 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



