-తొగుట సీఐ షేక్ లతీఫ్..
నవతెలంగాణ -రాయపోల్
ప్రజలు మూఢనమ్మకాలు మంత్రాలను నమ్మి మోసపోవద్దని శాస్త్రీయ విజ్ఞానంతో ఆలోచించాలి కంప్యూటర్ యుగంలో జ్ఞానంతో మెలగాలని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. బుధవారం రాత్రి రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.బ్యాంకు అధికారులమని ఫోన్ చేస్తే నమ్మవద్దు, అకౌంట్ వ్యక్తిగత వివరాలు గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స మరియు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఎక్కడికి వెళుతున్నారు? ఎవరెవరితో తిరుగుతున్నారు? గమనించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు.ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దు.
మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు రామారావు, ఎల్లయ్య, నర్సయ్య, ఎల్లయ్య, శేఖర్ నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కొంచం మానస, పోలీస్ సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.