Saturday, November 22, 2025
E-PAPER
Homeమానవిఅత్యాశ వద్దు…

అత్యాశ వద్దు…

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు చిట్టితల్లి.. చలి పెరిగిపోయింది, జాగ్రత్తగా ఉండు. ఈ వాతావరణం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావొచ్చు. నాన్న నీకు గత మూడు వారాలుగా సైబర్‌ నేరాల గురించి చెప్తూ వచ్చాను. ఈ ఉత్తరం కూడా దాదాపు అలాంటిదే. అంటే మోసాలు ఎలా చేస్తున్నారు అనే ఇంకొక కోణం. ఈ మధ్య కాలంలో తరచుగా పేపర్లో చదువుతున్నా, 80 ఏండ్ల వృద్ధుడు సైబర్‌ నేరానికి గురయ్యాడు లేదా వృద్ధురాలు లక్షల డబ్బు పోగొట్టుకుందని. చిన్న పిల్లలంటే భయపడో, ప్రలోభాలకు లొంగో, స్నేహితుల ప్రభావంతో డబ్బులు పోగొట్టుకున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ 70 ఏండ్లు పైబడిన వాళ్లని, సైబర్‌ నేరస్థులు బెదిరిస్తూ ఫోన్‌ చేస్తే, పెట్టుబడులు పెట్టండి తక్కువ సమయంలో మూడింతలు అవుతుందనంటే డబ్బులు పంపించడం, తర్వాత మోసపోయామని బాధపడడం.

ఒక్క విషయం ఎవరైనా ఆలోచించాలి ‘నేను తప్పు చేయనప్పుడు అవతలి వాళ్ళ బెదిరింపులకు ఎందుకు భయపడాలి?’. ఈ వయసులో ఎవరో ప్రలోభాలకు లొంగడం ఏంటి? ఒక వేళ మీరు ఏదైనా పొరపాటు చేసి ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించండి. మీ విషయాలు వారు గోప్యంగా ఉంచుతారు. ‘మీ అబ్బాయికి ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నాడు, వెంటనే డబ్బు పంపండి’ అంటూ ఒక వృద్ధురాలికి ఫోన్‌ వచ్చిందంట. ఆవిడ ఆందోళన పడుతూ లక్షల డబ్బు పంపింది. ఆ తర్వాత కొడుకు గురించి తెలుసుకుందామని ఫోన్‌ చేస్తే ఫోన్‌ స్విచ్చాఫ్‌. ఆ తర్వాత కొడుక్కు ఫోన్‌ చేస్తే ‘నాకేమి కాలేదు బాగానే ఉన్నాను’ అన్నాడట. అప్పుడు విషయం కొడుక్కు చెప్తే ఇది సైబర్‌ నేరగాళ్ల పని అని పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చాడట. ఇదే పని ఆమె ముందే చెస్తే డబ్బు పోయేది కాదు కదా! కొద్దిరోజుల కిందట ఒకతను ఫోన్‌ చేసి హిందీలో ‘నేను మీ నాన్న గారిని కలిశాను ఆయనకు డబ్బు కావాలట ఫలానా బ్యాంక్‌ అకౌంట్లో డబ్బులు వేయమన్నారు’ అని చెప్పాడు.

నేను ఏమైనా పొరపాటుగా విన్నాన అని రెండు మూడు సార్లు అడిగితే మళ్లీ అదే చెప్పాడు. అప్పుడు రాంగ్‌ నెంబర్‌ అని పెట్టేసాను. నా పేరు ముందుగా కంఫర్మ్‌ చేసుకున్నాడు. అయినా మా నాన్నకు డబ్బు అవసరమైతే మమ్మల్ని అడుగుతారు కానీ, వేరే వాళ్లకు ఎందుకు చెప్తారు? అదీకాక మా నాన్న ఈ లోకం నుండి వెళ్లి పోయి 28 ఏండ్లు అయ్యింది. ఎప్పుడైనా సరే.. డబ్బులు కావాలని మూడవ వ్యక్తి ఫోన్‌ చేస్తే అది నిజమా కాదా అని నిర్ధారించుకో, తొందరపడి ఎప్పుడూ ఎవరికీ పంపకు. మాకు అవసరమైతే నేరుగా నిన్నే అడుగుతాము. ఎంతో కష్ట పడితే కానీ రాదు డబ్బు. తేలిక మార్గాల్లో సంపాదించేవాళ్ళ వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ ప్రలోభాలకు లొంగకు. నీ దగ్గర డబ్బుంటే బ్యాంక్‌లో ఫిక్సడ్‌ డిపాసిట్‌ వేసుకో. తక్కువ వడ్డీ అయిన సరే నష్టం లేదు. అత్యాశకు పోవద్దు. ఉంటాను…

ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -