ప్రియమైన వేణు గీతికకు
నాన్న నువ్వు పండక్కి వచ్చి వెళ్లిపోయావు, ఇల్లంతా చిన్న బోయింది. మామయ్యాలను భోజనానికి పిలిచి వాళ్లకు వంట చేసి పెట్టావు, చాలా సంతో షం. ఇక నువ్వు వెళ్ళిపోయాక నా మనసేమీ బాగోలేదు. కొంచం కుదుట పడాలి కదా. నీతో దాదాపు నెలరోజులు గడిపాను. హాయిగా, సంతోషంగా ఉన్నాను. నాన్న నీకు గత ఉత్తరాల్లో సోషల్ మీడియా గురించి చెప్పాను. ఇప్పుడు కూడా అలాంటిదే చెప్తాను. సైబర్ నేరాలు చేసేవాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉంటారు. వాళ్ళు కొద్ది రోజులు చాటింగ్ చేసిన తర్వాత పరిచయం పెంచుకుంటారు. నెమ్మదిగా ఏదో ఆశ పెడతారు. అలా కొంత సమాచారం వాళ్ళ సభ్యులకు చేరవేస్తారు. వాళ్ళు వీళ్ళకు ఫోన్ చేయడం, మీరు దీనిలో పెట్టుబడి పెట్టండి, ఏడాది లోపల పెట్టిన దానికంటే మూడింతలు వస్తుంది అంటారు. ఒక లింక్ పంపిస్తారు. అది కనుక క్లిక్ చేస్తే నీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బు మాయం.
ఇలా మోసాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. నేను ఒక సంఘటన ఎదుర్కొన్నాను. నీకు చెప్పానో లేదో గుర్తు లేదు. అదేంటంటే నాకు ఫేస్‌బుక్ ద్వారా ఒక అమెరికన్ మహిళ పరిచయమయింది. అయితే నేను ఎక్కువ ఫేస్బుక్‌లో ఉండను కనుక అప్పుడప్పుడు హలో అనే ఉండేవి. ఆవిడ తన గురించి అంతా చెప్పుకొచ్చింది, సరే విన్నాను. కొద్దీ రోజుల తర్వాత ‘నేను ఇండియాకి వస్తున్నాను, ముందు హైదారాబాద్ వస్తున్నాను. నిన్ను కలిసి వెళ్తాను, కేవలం నీకోసం వస్తున్నాను, అక్కడి నుంచి వేరే ఊరు వెళ్తాను’ అని చెప్పింది.
నేను ఏదో చెప్తోంది సరేలే నేను ఎవరో తెలియదు నాకోసం అక్కడి నుంచి ఇండియాకి ఎందుకు వస్తుంది అనుకున్నాను. రెండు నెలల తర్వాత నాకు ఫోన్ చేసి ‘నేను హైద్రాబాద్ వచ్చాను, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను, ఇక్కడ నన్ను కస్టమ్స్ వాళ్ళు డబ్బులు కట్టమని అంటున్నారు, నాకు డబ్బులు కావాలి’ అని తనకు కావాల్సిన అమౌంట్ చెప్పింది. అసలు తను ఎవరో తెలియదు, నేను తనకు తెలియదు, నాకోసం రావడం ఏమిటి? ఇందులో ఏదో తిరకాసు ఉందని అర్ధమైంది. వెంటనే నేను ‘నా దగ్గర ఒక్క పైసా లేదు’ అని చెప్పా. చాలా సేపు నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించింది. ‘నేను నిన్ను రమ్మని అనలేదు, ప్రయాణం పెట్టుకున్న దానివి నువ్వే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, నన్ను అడగటం కరెక్ట్ కాదు’ అని కచ్చితంగా చెప్పేశాను.
‘అంతేనా నీ ఫ్రెండ్‌షిప్’ అంది, ‘అంతే’ అని చెప్పా. అయితే తర్వాత కొద్దీ రోజులు బాధపడ్డాను. నిజంగా అవసరం వుందేమో అని. ఒక ఫ్రెండ్‌తో చెప్తే మంచిపని చేశారు అన్నారు. ఇదొక రకం మోసం. ఇంకొక సంఘటన ‘మీరు లక్కీ డిప్‌లో ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు. వెండి దీపం, మీకోక లింక్ పంపిస్తాను అది క్లిక్ చేసి ఓకే అని పెట్టండి’ అని ఫోన్ చేశారు. నేను ‘గిఫ్ట్ ఏమీ వద్దు అవసరం లేదు’ అన్నాను. అయినా సరే వినకుండా ‘మీరు అదొక్కటే కాదు ఓకే అని పంపిస్తే ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ వస్తాయి’ అన్నారు. నేను ఒక్కటే చెప్పా ‘నేను కోటీశ్వరాలిని (వేసుకోవడాని ఒక కోటు కూడా లేదు, అది వేరే విషయం) నాకేమి గిఫ్ట్స్ అవసరం లేదు, మీరే ఉంచుకోండి’ అని చెప్తే అప్పుడు ఫోన్ పెట్టేసింది. నాన్న ఇటువంటివి వచ్చినప్పుడు లింక్ నొక్క కుండా, ఏదైనా ఫోన్ వస్తే మాకేమీ అక్కర్లేదని కచ్చితంగా చెప్పేయాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. వుంటాను… జాగ్రత్త.
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



