Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిబంధనలు పట్టించుకోం...

నిబంధనలు పట్టించుకోం…

- Advertisement -

– డీఈవోల తీరుపై సర్వత్రా విమర్శలు
– ఉత్తర్వులకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు
– పది మందికిపైగా విద్యార్థులున్నా ఒక్కరే టీచర్‌
– జూనియర్లను ఇతర బడులకు పంపిస్తున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ విమర్శలకు తావిస్తున్నది. పలు జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో)లు నిబంధనలు పాటించడం లేదంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పది మంది విద్యార్థుల వరకు ఒక టీచర్‌, 11 నుంచి 60 మంది విద్యార్థుల వరకు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిబంధనలను జారీ చేసింది. కానీ పలు జిల్లాల్లో డీఈవోలు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. పది మంది విద్యార్థులుంటే ఒక టీచర్‌ను ఉంచుతున్నారు. అయితే పది మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్నా ఒక్కరే టీచర్‌ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఒక పాఠశాలలో 14 మంది విద్యార్థులుంటే ఒక్క టీచర్‌ మాత్రమే కొనసాగాలని చెప్తున్నారు. మరో బడిలో 16 విద్యార్థులున్నా ఒక టీచర్‌కు పరిమితం చేస్తున్నారు. 11 నుంచి 60 మంది విద్యార్థుల వరకు ఎంత మంది ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలన్న నిబంధనను డీఈవోలు పాటించడం లేదు. గతంలో 19 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్‌ ఉండాలనే నిబంధన ఉండేది. పాత నిబంధనల ప్రకారమే ఇప్పుడు డీఈవోలు ఉపాధ్యాయుల సర్దుబాటు చేస్తుండడం గమనార్హం.

విద్యార్థులకు తీవ్రనష్టం
డీఈవోల తీరు వల్ల రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగే ప్రమాదమున్నది. ఇంకోవైపు 20 మందిలోపు ఒకే టీచర్‌ ఉంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నది. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులుంటాయి. ఒక తరగతిలో ఇద్దరు, మరో తరగతిలో ఐదుగురు, ఇంకో తరగతిలో ఆరుగురు పిల్లలు ఉండొచ్చు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒకే టీచర్‌ ఉంటే అన్ని సబ్జెక్టులనూ ఎలా బోధిస్తారన్న ప్రశ్న తల్లి దండ్రులకు వస్తున్నది. దానివల్ల ఉపాధ్యాయుల బోధనపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నది. ఇది విద్యా ప్రమా ణాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే మూడో తరగతి విద్యార్థులు కింది తరగతులకు చెందిన పాఠాలను సరిగ్గా చదవలేకపోతున్నారనీ, లెక్కలు చేయలేక పోతున్నారని అసర్‌, న్యాస్‌ సర్వేలు చెప్తున్నాయి. తరగతికొక ఉపాధ్యా యుడుండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేస్తున్నది. 40 మంది పిల్లల వరకు ఇద్దరు, 41 నుంచి 60 మంది పిల్లల వరకు ముగ్గురు, 61 నుంచి 90 వరకు నలుగురు టీచర్లుండాలని ప్రభుత్వానికి గతంలోనే సూచించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇతర బడులకు వారిని తరలించాలనే నిర్ణయంతో ఆ బడులకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

20 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లుండాలి : డీఎస్సీ-2024 ఉపాధ్యాయ సంఘం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 20 మందిలోపు విద్యార్థులుంటే తప్పనిసరిగా ఇద్దరు ఉపాధ్యాయులం డాలని డీఎస్సీ-2024 ఉపాధ్యాయ సంఘం నేతలు రావుల రామ్మోహన్‌రెడ్డి, ఇర్ఫాన్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రాము, కోటేశ్‌, పవన్‌, కావ్య, రమ్యశ్రీ, స్వప్నలత, మౌనిక ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని మండలాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 15, 16 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఎంఈవోలు ఫోన్‌ చేసి ఇద్దరు ఉపాధ్యాయులుంటే సర్దుబాటు కింద జూనియర్‌ టీచర్‌ను వేరే పాఠశాలకు పంపిస్తామంటూ ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -