రేఖ కళ్యాణి ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యాన్ని ఖరీదు చేయాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. శుక్రవారం పసర గ్రామ మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి కొనుగోలుదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కళ్యాణి మాట్లాడుతూ , రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలను నడిపే వారు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, ధాన్యం విక్రయించాలంటే దళారులను నమ్మి మోసపోవద్దు అని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం విక్రయించాలని కోరారు.
అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న రవాణా రిజిస్టర్ తనిఖీ చేసి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం యొక్క రవాణా రిజిస్టర్ నిర్వహించాలని కోరారు, రైతుల యొక్క ధాన్యం కొనుగోలును వెంటనే ఆన్లైన్ చేసి టోకెన్ నెంబర్ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని అన్నారు. కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, ముఖ్యంగా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మనమంతా అండగా నిలబడి, ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పసర ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.



