నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
డిసెంబర్ 20లోగా పూర్తిచేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మేడారం పనులపై రాజకీయాలొద్దు : మంత్రి సీతక్క
నవతెలంగాణ – ములుగు
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనుల నాణ్యత విషయలో ఏలాంటి రాజీపడొద్దనీ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంకు చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండ సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులు, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం హరిత కాకతీయ హౌటల్‌లో అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూలంకషంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాకారం లోపల, సివిల్ పనులు, గద్దెల ఎత్తు పెంచడం, నిర్మాణం, ప్రధాన ద్వారాలు, ఆర్చ్, 4 వాచ్ టవర్లు, ప్రాకారానికి చుట్టూ సీసీ రోడ్డు పనులు సమాంతరంగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. మెన్ మెటీరియల్ పెంచి 24 గంటలు పనులు జరగాలని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు, డివైడర్లు, ప్లాంటేషన్ నెల రోజుల్లో పూర్తి కావాలన్నారు. మల్లంపల్లి బ్రిడ్జి, కటాక్షపూర్ బ్రిడ్జి పనులు డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో క్యూ లైన్ షేడ్స్, నాలుగు రోడ్డు లైన్ల విస్తరణ, టెంపర్ అభివృద్ధి, గద్దెల వద్ద భక్తుల కెపాసిటీని 3 వేల నుంచి 10 వేలకు పెంచనున్నారు. 19ఎకరాల భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జంపన్నవాగుపై చెక్ డ్యామ్‌ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. శాశ్వత బస్‌స్టేషన్, పర్యాటక శాఖ ద్వారా జంపన్నవాగు అభివృద్ధి, సుందరీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివరించారు.
‘మేడారం’ అభివృద్ధి పనులపై రాజకీయాలొద్దు : మంత్రి సీతక్క
అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు జరగని విధంగా మేడారం జాతరలో ముందస్తుగానే ప్రభుత్వం అభివద్ధి పనులు చేపట్టిందని, వాస్తవాలు తెలుసుకోకుండా అభివద్ధి పనులపై రాజకీయాలు చేయొద్దని తెలిపారు. కొన్ని పత్రికలు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు రాయడం సరికాదని అన్నారు. గిరిజనుల సంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, గిరిజనుల అస్తిత్వం, ఆత్మగౌరవానికి విలువలు ఇస్తూ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
మరో వారం రోజుల్లో గద్దెల ప్రాంతం ఒక రూపానికి వస్తుందని అన్నారు. పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం కాకుండా పనులు చేపట్టినా కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. జంపన్న వాగులో రూ.10కోట్లతో చెక్‌డ్యాములు కట్టి రెండు సంవత్సరాలకే కోటి రూపాయల ఖర్చుతో తొలగించారని, ఎవరు నిధులు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజల గమనిస్తున్నారని అన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే 200 సంవత్సరాల పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తుందని, చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మేడారంలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని, ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హరీశ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్‌పీ శబరిష్, డీఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్, జి.సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఈఎన్‌సీ, ఆర్డీఓ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, అధికారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.



