‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:'(ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అనే నోటితోనే ‘నస్త్రీ స్వాతంత్ర మర్హతి’ అంటారు. దీన్ని బీజేపీ మరింతగా ముందుకు తీసుకుపోతోంది. కాబట్టే ఒక పక్క ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటూనే మరోపక్క ఆమెను తిరిగి నాలుగ్గోడలకు పరిమితం చేసే వ్యాఖ్యలు చేస్తోంది. ముఖ్యంగా కాషాయజెండా రాజ్యమేలుతున్న రాష్ట్రాల్లో ఈ ప్రయత్నం యధేచ్ఛగా సాగుతోంది. అందునా మన ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ ముందు భాగానే ఉంటుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో ‘మహిళలపై లైంగిక దాడులు జరగకుండా ఉండాలంటే వాళ్లు ఇంట్లోనే ఉండాలి. అలా కాదని వెళ్తేే లైంగికదాడులు జరగొచ్చు’ అనే పోస్టర్లు వెలిశాయి.
పైనచెప్పిన పోస్టర్లను అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పాన్సర్ చేశారు. అంటే మహిళలు బయటకు వస్తే మేము కాపాడలేమని పోలీసులు చేతులెత్తేసినట్టేగా. కాపాడాల్సిన వారే ఇలా వ్యవహరించడం తీవ్రమైన విషయం. స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరిచే ఈ పోస్టర్లను మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి పోస్టర్లకు అనుమతి ఎలా ఇస్తారంటూ అధికారులను నిలదీశాయి. తమ తప్పును తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ పోస్టర్లను తొలగించేశారు. అయితే తమకు తెలియకుండా ఈ పోస్టర్లు అంటించారంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
మహిళల పట్ల ఇలాంటి ఆలోచనా ధోరణి మనదేశంలో కొత్తేమీ కాదు. నిర్భయ ఘటనలో ఇది మనకు మరింత స్పష్టం కనిపిస్తుంది. మహిళలపై లైంగిక దాడులు జరిగిన ప్రతీసారీ వారి వస్త్రధారణను వేలెత్తి చూపుతున్నారు. ‘ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు ఉంది’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవి సాధారణ ప్రజల నుండి కాదు సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నోటి నుండే వస్తున్నాయి. నాయకుల ఆలోచనా ధోరణే ఇలా ఉంటే ఇక సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? అందరూ కలిసి ‘మీ సమస్యలకు మీరే బాధ్యులు’ అంటూ మహిళలను ఆత్మన్యూనత భావనలోకి నెట్టేస్తున్నారు.
ఒకపక్క మనప్రధాని ఎక్కడికి వెళ్లినా ‘బేటీ బచావో’ అనే నినాదాన్ని భుజాన మోసుకొని వెళుతున్నారు. మహిళల గురించి, అభ్యున్నతి గురించి, రక్షణ గురించి చెవులు చిల్లులు పడేలా ఉపన్యాసాలిస్తున్నారు. కానీ ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే నాయకుల నోటికి తాళాలు వేసేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. దీనికి కారణం ‘మహిళలంటే నాలుగ్గోడలకే పరిమితం కావాలి, భర్తను సుఖపెట్టడమే ఆమెపని, పిల్లల్ని కనే యంత్రంగా మాత్రమే ఆమె ఉండాలి’ అని చెబుతున్న మనుధర్మాన్ని నెత్తిన మోయడమే.
ఇలాంటి మనుధర్మాన్ని, సనాతన ధర్మాన్ని యావత్ దేశం పాటించాలని ప్రచారం చేస్తుంది బీజేపీ. కాబట్టే మహిళల స్వేచ్ఛను వీళ్లు భరించలేరు. చదువులు, ఉద్యోగాలంటూ అమ్మాయిలు బయటకు వస్తే ఒప్పుకోరు. ప్రశ్నిస్తే అసలే తట్టుకోలేరు. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే'(స్త్రీలు బాల్యంలో తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాలి) అనే సూక్తిని తూ.చ తప్పక పాటించే ఈ ‘మను’సైన్యం నీడన మహిళలను కించపరిచే ఇలాంటి పోస్టర్లను తప్ప వేరే ఆశించలేము. ఇలాంటి భావజాలాన్ని పెంచిపోషించే పాలకులున్నంత కాలం స్త్రీలకు నిజమైన స్వేచ్ఛ దొరకుతుందనుకోలేం!
మోడీ పైకిచెప్పే నినాదాలు నేడు అపహాస్యంగా మారిపోయాయి. దేశంలో రోజుకు 86 లైంగిక దాడులు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి ప్రధానంగా బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలోనే జరుగుతున్నాయి. దేశంలో ప్రతి ఏడాది వందల మంది మహిళలు, బాలికలు వ్యభిచార గృహాలకు నెట్టివేయబడుతున్నారు. ప్రతియేటా ముప్తైవేలమంది బాలికలు అక్రమరవాణా ఊబిలో చిక్కుకుంటున్నారు. భ్రూణహత్యలు, యాసిడ్ దాడులు, బాల్యవివాహాలు, లైంగికదాడులు హత్యలతో మహిళల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
ఇలాంటి సమస్యల సుడిగుండం నుండి బయటపడినప్పుడు మాత్రమే స్త్రీ జాతి విముక్తి సాధిస్తుంది. అన్ని రంగాలలో స్త్రీలు అభివృద్ధి సాధించిన నాడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలా నడవాలంటే సమాజంలో మార్పు అవసరం. ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న పాలకుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ‘ఇంటికి వెలుగు ఇల్లాలు’ అని మాత్రమే కాదు ‘సమాజానికి వెలుగు స్త్రీజాతి’ అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏది ఏమైనా మనుధర్మం మొదలు నేటి వరకు వెంటాడుతున్న ఆంక్షల అడ్డుగోడలను బద్దలు కొడుతూ తన అస్థిత్వం కోసం స్త్రీ చేస్తున్న పోరాటం గొప్పది. దీన్ని ప్రజలు, మరీ ముఖ్యంగా పాలకులు గుర్తించాలి. ఇప్పటికైనా ఆమెను వెనక్కు నెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి.
గడప దాటొద్దా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES