Thursday, February 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'పద్మా'లను పలుచన చేయకండి!

‘పద్మా’లను పలుచన చేయకండి!

- Advertisement -

దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటిస్తున్నది. తమ రాష్ట్రాల్లో గొప్ప సేవలందించిన వారికి ఈ అవార్డు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పేర్లు సిఫారసు కూడా చేస్తుంటుంది. భారత రత్న మొదలుకొని పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డులు 1954లో మొదలుకాగా 1978-79లో నాటి మొరార్జీ దేశాయి నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఈ అవార్డులను నిలిపివేసింది. అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వడానికి అర్హులు లేకపోతే ఆయా సంవత్సరాల్లో నిలిపివేస్తారు.

ఇప్పటివరకు యాభైమూడు మంది ఎంపికైన విశిష్ట వ్యక్తులు మాత్రమే భారతరత్న అవార్డు పొందగలిగారు. ఇక సామాజిక సేవ, కళలు సాహిత్యం, సైన్సు, వైద్యం, వ్యాపారం, పరిశ్రమలు, క్రీడలు లాంటి రంగాల్లో వ్యక్తుల సేవకు గుర్తింపునిస్తూ ఈ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఐఏఎస్‌లకు మాత్రం ఈ అవార్డులివ్వరు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాజీలేకుండా సేవలందించి అఖిలభారత సర్వీసెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన ఎస్‌.ఆర్‌.శంకరన్‌ తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డును తిరస్కరించారు. కేవలం తన విధులు నిర్వర్తించానని, తనకు గుర్తింపు అవసరం లేదని చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వం గలవారు మన దేశంలో చాలా అరుదు.

అసంబద్ధ ఎంపికలు ఎవరికోసం?
పద్మ అవార్డు రాజకీయం అవుతున్న సందర్భాలు కోకొల్లలు. దానిపై విమర్శలు, ప్రతివిమర్శలు అంతే సహజమైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సిఫార్సులు పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినవి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంపికలు కూడా దూరదృష్టితో కూడి రాజకీయ ప్రయోజనాలు ఆశించినవే. నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు భారతరత్న ప్రకటించడం వెనుక అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వపు దురుద్దేశం స్పష్టమే! తమిళనాట పాగా వేయాలని ఆలోచనతో ప్రకటించిన అవార్డు మాత్రమే! ఆయన జాతీయ నాయకుడు కాదు, ఒక రాష్ట్రానికి పరిమితం. ఆయన సిద్ధాంతాలు విధానాలు దేశవ్యాప్తంగా ప్రభావితమేమీ చేయలేదు.

ఈ మధ్య రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్న ప్రకటించడం కూడా అందుకు భిన్నమైనదేమీ కాదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అందించిన ‘సహకారం’. ఒకపక్క మారుమూల కళాకారులను గుర్తించి వారిని తగు రీతిలో అవార్డు ద్వారా సన్మానిస్తున్నామనీ చెబుతూనే, మరో పక్క తమ రాజకీయ లబ్ధికి ఉపకరించే వ్యక్తులను ఎంపిక చేయడం ఏ రకమైన న్యాయం? వివాదా స్పదమైన వ్యక్తులు, అనర్హులు అందలమెక్కుతుంటే అసలు అర్హులు వెనుకకుపోవడం బాధాకరం. తెలుగు రాష్ట్రాల నుండి అవార్డులకు ఎంపికైన వారిలో కొద్ది మందిపై ఆరోపణలు ఉన్నాయి. ‘పెద్దల’ ఆశీస్సులే వారి ఎంపికకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మోడీ ప్రభుత్వం తెలివిగా రెండు రాష్ట్రాలకు సమానంగా పద్మ అవార్డులు పంచిపెడుతున్నది.

కొంతమంది ముఖ్యంగా సినీనటులు ఇరు రాష్ట్రాలకు చెందిన వారు. పుట్టింది ఆంధ్రాలో, ఉంటున్నది తెలంగాణలో. కాబట్టి, రెండు రాష్ట్రాలు తమ ఖాతాలో వేసుకోవడం పరిపాటి. ఒకవేళ తమకు నచ్చకపోయినా బాహాటంగా విమర్శించరు. ఎందుకంటే ఇందులో రాజకీయ దృష్టి, దూరదృష్టి చాలా పనిచేస్తాయి. ఐఐటి విద్యను తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరిచయం చేసి వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చుక్కారామయ్య సేవలకు నేటికీ గుర్తింపు లేదు. అంతేకాదు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాత్ర క్రియాశీలకమైనది. ప్రతియేడు ఆ మహానుభావుడి పేరు సిఫారసు లేఖలో మాత్రమే కనిపించడం గమనార్హం. మన రాష్ట్రంలో ఇంకా చాలామంది మహోన్నతులు-రచయితలు, కవులు, కళాకారులు ఈ పద్మ అవార్డులకు అర్హులు కాగా వీరంతా ప్రభుత్వాలచే నిరాదరణకు నిర్లక్ష్యానికి గురవడం విదితమే. గొప్ప వ్యక్తులకు పద్మ అవార్డు రాకపోవడం నిజంగా శోచనీయం.

అవార్డులు బీజేపీ దయాదాక్షిణ్యమా?
అసలు పద్మ అవార్డులు బీజేపీ ప్రభుత్వం ఇచ్చేవా లేక జాతీయస్థాయి అవార్డులా అనేది సామాన్యుడి సందేహం. అవార్డులకు భావజాలంతో పనిలేదు. సంబంధిత రంగంలో వారి విశిష్ట సేవ మాత్రమే పరిగణించబడాలి. వారు ఏ పార్టీకి పనిచేశారు, వారి ఆశయాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు అవసరం లేదు, ఈ అవార్డులకు అవి కొలమానం కాదు. ఇందులో రాజకీయ కోణం అసలే అవసరం లేదు. కానీ, మన ప్రభుత్వాలు ఏ పని చేసినా రాజకీయమే రాజ్యమేలుతోంది. ముఖ్యంగా సినీ నటుల విషయంలో పద్మ అవార్డులు పలుచబడ్డట్లు అర్థమవుతున్నది. తమవారికి పద్మశ్రీ మొదలు పద్మభూషణ్‌ వరకు సిఫార్సులు చేస్తున్నారు, అవార్డులూ తెచ్చుకుంటున్నారు. అవార్డులు రాని అనేకమంది ప్రతిభ కలవారు పరిశ్రమలో ఉన్నారు. వారందరూ ప్రభుత్వాల ‘ఆశీస్సులు’ లేని వారు లేదా వారి పెద్దల సామాజిక వర్గాలకు చెందిన వారు కాకపోవడమే అనర్హతకు కారణం! అంటే అవార్డు ఎంపిక నేడు తమ వారి అనుగ్రహం మీద ఆధారపడి ఉందన్న మాట.

గతంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు భారతరత్న అవార్డు ప్రకటిస్తే ఆయన చాలా గౌరవంగా దాన్ని తిరస్కరించాడు. అప్పట్లో బుద్ధదేవ్‌ భట్టాచార్యకు కూడా అవార్డు ఇస్తున్నట్టు వదంతులు వ్యాపింపజేశారు తప్ప ఇవ్వలేదు. ఇప్పుడు ఎంతో వ్యూహాత్మకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేరళ మాజీ ముఖ్య మంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌కు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. ఇది ఆహ్వానించదగినది. అవార్డుకు ఆయన వందశాతం అర్హుడే. ఆయన జీవిత చరమాంకం వరకు కేరళ కమ్యూనిస్టు రాజకీయాలను ఎంతో విలువలతో నడిపిన మహోన్నత వ్యక్తి. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన రాజకీయ నీతిజ్ఞుడు. అయితే, ఆయనకు పద్మభూషణ్‌ ఇవ్వడం కేవలం కేరళలో ఈసారి ఎన్నికల్లో పాగా వేయాలనే దురుద్దేశమే తప్ప, కమ్యూనిస్టుల మీద గౌరవంతో కాదన్నది సత్యం. అచ్యుతానందన్‌కు కూడా పద్మభూషన్‌ అవార్డును ప్రకటించగా, వారి కుటుంబం సున్నితంగా తిరస్కరించింది.

సావర్కర్‌కు అవార్డు ఆలోచన, భరతజాతిని అవమానించడమే!
ఇటీవల ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది- ఆరెస్సెస్‌ నేత వీర సావర్కర్‌కు భారతరత్న ప్రకటించాలని ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ కోరడం. స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆరెస్సెస్‌, హిందూ మహాసభ సంస్థలు చాలా విద్రోహ పూరితంగా ప్రవర్తించినట్లు చరిత్రకారుల వాదన. అందుకు నిరూపణలు కూడా ఉన్నాయి. ఈ రెండు సంస్థలతో సంబంధం ఉన్న వీరసావర్కర్‌ తాను జైల్లో ఉండగా బ్రిటిష్‌ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాసి క్షమాభిక్ష కోరి విడుదలైనట్లు చరిత్ర చెబుతోంది. అవకాశవాదంతో ప్రాణభీతితో బ్రిటిష్‌ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో బయటపడ్డవారు దేశభక్తులు ఎలా అవుతారు? శత్రురాజ్యంతో లాలూచీపడి వారి క్షమాభిక్షతో జైలు నుండి విడుదలైన వారిని నేడు జాతి అత్యంత గౌరవ పురస్కారమైన భారతరత్న అవార్డుకు ఎంపిక చేయాలనడం, అలాంటి డిమాండ్‌ రావడం ఆశ్చర్యకరం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు కొమ్ముకాసిన వారికి జాతి అత్యుత్తమస్థాయి అవార్డు ఇస్తే అది భరతజాతిని అవమానించినట్లే అవుతుంది.

సావర్కర్‌కు అవార్డు ప్రకటిస్తే దాని ప్రతిష్ట పెరుగుతుందని భగవత్‌ చెప్పారు. ఆయనకు అవార్డు ఇస్తే గౌరవం పెరగకపోగా, ఉన్నది కూడా తగ్గిపోతుంది. గతంలోనే కొంతమంది వ్యక్తులకు ప్రకటించి అవార్డు విలువను తగ్గించారు. సహజంగా నోబెల్‌ శాంతి బహుమతి కొన్ని సార్లు సంస్థలకు మాత్రమే ఇస్తారు. మనదేశంలో ఆ సంప్రదాయం లేదు. కానీ, అదే నయమైంది. లేకుంటే గొప్పగొప్ప అవార్డులు ఆరెస్సెస్‌కు, విశ్వహిందూ పరిషత్‌ లాంటి సంస్థలకు కూడా ప్రకటించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆరెస్సెస్‌ స్థాపించి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసి ప్రధాని మోడీ తన ‘రుణం’ తీర్చుకున్నారు. మరి ఈ మధ్య వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ విషయంలో ఇలాంటి నిర్ణయం ఏది చేయలేదు. పద్మ అవార్డు వ్యక్తులకే కాదు, సంస్థలకూ ఇవ్వొచ్చునని ఒక సవరణ కూడా భవిష్యత్తులో రాదన్న నమ్మకం లేదు. ఇప్పుడు సావర్కర్‌కు, కొంతకాలానికి జాతిపితను చంపిన గాడ్సేకు కూడా ప్రకటించాలని డిమాండ్‌ రావచ్చు. ప్రజాస్వామ్యవాదులారా బహుపరాక్‌!

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -