Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దు

దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దు

- Advertisement -

పూజారుల అంగీకారంతోనే అమల్లోకి గద్దెల ప్రాంతంలో పనులు
డీపీఆర్‌ పూర్తి కాగానే సీఎం నిర్ణయాలు వెల్లడి : మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క
ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతులకు భూములు, నష్టపరిహారం అందజేత


నవతెలంగాణ – ములుగు
మేడారం గద్దెలపై రాజకీయం చేయడం మానుకోవా లని మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. గిరిజన గోత్రాలు, పూజ ఆచారాల ప్రకారం.. అమ్మవార్ల పూజారుల అంగీకారంతోనే గద్దెల ప్రాంతంలో నూతన టెక్నాలజీతో పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పూర్తిస్థాయిలో డీపీఆర్‌ పూర్తికాగానే ముఖ్యమంత్రి ముందు సమావేశమై పూర్తి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో నిర్మించనున్న ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ నిర్మాణం కోసం భూములిచ్చిన 41 మంది రైతులకు ఇంచర్లలోని ఏకో పార్క్‌ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ రైతులకు మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకరతో కలిసి పట్టాలు అందచేశారు. ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మండలంలోని ఇంచర్ల గ్రామ శివారులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేశారు. మేడారం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పలు గ్రామాల గుండా రోడ్డు విస్తరణ పనులు చేయడమే కాకుండా డైవర్షన్‌ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి సంబంధించిన నివేదికలను సంబంధిత అధికారులు తయారు చేస్తున్నారని తెలిపారు.

గిరిజన పూజారులు, భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా ఆలోచన చేస్తున్నామని, వెయ్యేండ్లు నిలిచిపోయేలా నిర్మాణపనులను చేపడుతున్నామని అన్నారు. జాతర సందర్భంగా రైతులక అన్యాయం జరగకుండా చూస్తున్నామని తెలిపారు. కొద్దిరోజుల్లో పూజారులు, దేవాదాయ శాఖ అధికారులతో ఆర్కియాలజీ అధికారులు సమావేశమై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ములుగు జిల్లా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా తెరకెక్కిందని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ, దట్టమైన అడవీ ప్రాంతంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నదని అన్నారు. ఎంపీ బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మేడారంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, అటవీ శాఖ వారు ఏకో పార్కును ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రాంతం రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సీహెచ్‌ మహేందర్‌ జి, ఆర్డీఓ వెంకటేష్‌, ఇంచర్ల గ్రామంలో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41 మంది రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -