Thursday, January 8, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మున‌గాకు మ‌రువ‌ద్దు..

మున‌గాకు మ‌రువ‌ద్దు..

- Advertisement -

చుక్కకూర, మెంతికూర, తోటకూర, పాలకూర వంటివి ఏదో ఒక రూపంలో తరచూ తింటూనే ఉంటాం. కానీ మునగాకును పెద్దగా పట్టించుకోము. నిజానికి ఇది పోషకాల గని. ఔషధాల నిధి. బలాన్నిస్తుంది, నోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కాలంలో వచ్చే అనారోగ్యల నుంచి కాపాడుతుంది. అంత మంచి మునగాకుతో ఈ వెరైటీలు చేసి చూడండి.

మునగాకు పప్పు
కావల్సిన పదార్థాలు: కందిపప్పు, మునగాకు – కప్పు చొప్పున, ఉల్లి తరుగు – అర కప్పు, చింతపండు – నిమ్మకాయంత, పచ్చిమిర్చి ముక్కలు – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – అర చెంచా, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – నాలుగు రెబ్బలు, వెల్లుల్లి తరుగు – ముప్పావు చెంచా, ఆవాలు – శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – చెంచా చొప్పున, ఇంగువ – అర చెంచా.
తయారీ విధానం: కందిపప్పు, మునగాకులను రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తెరిచి చారు గరిటెతో మెత్తగా మెదపాలి. దీనికి కొన్ని నీళ్లు, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు జోడించి ఉడికించాలి. రెండు పొంగులు వచ్చాక దించేయాలి. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేస్తే సరి. రుచికరమైన మునగాకు పప్పు రెడీ.

మఖానా
కావల్సిన పదార్థాలు: పూల్‌ మఖానా – కప్పు, మునగాకు పొడి – టేబుల్‌ స్పూను, నెయ్యి రెండు చెంచాలు, చాట్‌ మసాలా – అర చెంచా, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: కడాయిలో మఖానాను కలియ తిప్పుతూ సన్న సెగ మీద వేయించాలి. నాలుగైదు నిమిషాల తర్వాత ఒకటి చేతిలోకి తీసుకొని నొక్కి చూడండి. సాగకుండా విరిగితే చక్కగా వేగినట్లు. వీటిని గిన్నెలోకి తీసి అదే కడాయిలో నెయ్యి, మునగాకు పొడి, చాట్‌ మసాలా, ఉప్పు, వేయించిన పూల్‌ మఖానా వేసి నిమిషం వేయించి దించేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. తర్వాత తినాలనుకుంటే గాలి చొరబడని సీసాలో భద్రం చేయాలి.

పచ్చడి
కావల్సిన పదార్థాలు: మునగాకు, కొబ్బరి తురుము – కప్పు చొప్పున, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లం ముద్ద – చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – రెండు చెంచాలు, ఆవాలు, జీలకర్ర – చెంచా చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – పావు చెంచా.
తయారీ విధానం: కడాయిలో ఒక టేబుల్‌ స్పూను నూనె కాగనిచ్చి పచ్చిమిర్చి, మునగాకులను ఒక నిమిషం వేయించాలి. ఎక్కువ వేగకూడదు. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొబ్బరి తురుము, అల్లం ముద్ద, ఉప్పు, అర కప్పు నీళ్లు జోడించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేసి, నిమ్మరసం కలిపితే సరి. నోరూరించే మునగాకు పచ్చడి రెడీ.

పరోట
కావల్సిన పదార్థాలు: గోధుమపిండి, మునగాకు – కప్పు చొప్పున, అల్లం ముద్ద – చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర, కారం, గరంమసాలా – అరచెంచా చొప్పున, వాము, పసుపు – పావు చెంచా చొప్పున, నూనె – చెంచా, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారీ విధానం: మునగాకు కడిగి, పావుగంట నీళ్లలో ఉంచి తర్వాత నీళ్లు తీసేయాలి. ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మునగాకు, అల్లం ముద్ద, ఉప్పు, జీలకర్ర, కారం, గరంమసాలా, వాము, పసుపు, నూనె వేసి కొన్ని నీళ్లతో బాగా కలపాలి. ఈ పిండిని ఒక అరగంట పక్కన వుంచి మరోసారి కలిపి, చపాతీల కంటే కొంచెం ముందంగా రొట్టెలు వత్తుకోవాలి. అన్నీ అయ్యాక పెనం వేడిచేసి నెయ్యితో పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వీటికి చెట్నీ లేదా గ్రేవీ ఏదైనా బాగుంటుంది.

ఆలూ మొరింగా సబ్జీ
కావల్సిన పదార్థాలు: మునగాకు – రెండు కప్పులు, ఆలూ – రెండు, ఉల్లి తరుగు – పావు కప్పు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన పచ్చిమిర్చి – టేబుల్‌ స్పూను, వెల్లుల్లి తరుగు – చెంచా, జీలకర్ర – ఒకటిన్నర చెంచా, గరంమసాలా – అర చెంచా, కారం – ముప్పావు చెంచా, పుసుపు, ఇంగువ – పావు చెంచా చొప్పున.
తయారీ విధానం : ఆలూ చెక్కు తీసి అంగుళమంత ముక్కలు కోయాలి. కడాయిలో నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. ఇది వేగాక పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఇంగువ, ఉల్లిగడ్డ ముక్కలు ఒక్కొక్కటి వేయాలి. ఉల్లి దోరగా వేగిన తర్వాత ఆలూ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. నాలుగు నిమిషాల తర్వాత మునగాకు జత చేసి మధ్యమధ్యలో కలియతిప్పుతూ ఇంకో ఆరేడు నిమిషాలు వేయించాలి. చివర్లో కారం, గరంమసాలా జోడించి కలియబెట్టి దించేస్తే సరిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -