Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీ పీఠాన్ని కదిలించిన రైతు ఉద్యమాలను మర్చిపోవద్దు

ఢిల్లీ పీఠాన్ని కదిలించిన రైతు ఉద్యమాలను మర్చిపోవద్దు

- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
ఆమనగల్‌లో రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూ నిర్వాసితుల సదస్సు


నవతెలంగాణ-ఆమనగల్‌
నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ పీఠాన్ని కదిలించిన రైతు ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దని, పేద రైతుల భూముల జోలికి వస్తే ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణంలో సోమవారం సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాన్గుల వెంకటయ్య అధ్యక్షతన ఆమనగల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూ నిర్వాసిత రైతుల అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. రైతులకు రక్షణగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు మద్దతుగా మారాయని అన్నారు. మన భూమి మనకు దక్కే వరకూ రైతులందరూ ఐక్యమత్యంతో ముం దుకెళ్లాలని సూచించారు. రాజకీయ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో లబ్ది పొందడం కోసం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం బూర్జువా నాయకులు మతం, కులం పేరుతో విభజించి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని అన్నారు. సాగర్‌ మాట్లాడుతూ.. భూస్వాముల భూములను కాపాడటం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల లబ్ది కోసం ప్రభుత్వం అలైన్‌మెంట్‌ మార్చిందని తెలిపారు. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్న సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కోవడం అన్యాయమని అన్నారు. రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయిన చరిత్ర ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచందర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, రైతు సంఘం నాయకులు ఎమ్‌.యాదయ్య, గుమ్మడి కురుమయ్య, పిప్పళ్ళ శివశంకర్‌, భూ నిర్వాసితుల పోరాట కమిటీ అధ్యక్షులు దొడ్డి పరమేష్‌, నాయకులు వెంకటస్వామి, పబ్బతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -