Thursday, May 15, 2025
Homeప్రధాన వార్తలుఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దు

ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దు

- Advertisement -

– సులభంగా అనుమతుల ప్రక్రియ
– లైడార్‌ సర్వేతో వనరుల మ్యాపింగ్‌ : తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల్ని తిప్పించుకొనే పద్ధతుల్ని విడనాడి, జవాబుదారీతనంతో సమస్యలు పరిష్కరించేలా విధాన రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దీనికోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి, తగిన సిఫార్సులతో త్వరగా నివేదిక సమర్పించాలని చెప్పారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని పౌర సేవలు, అనుమతులపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో బుధవారంనాడాయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఈ సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాంపైకి తెస్తూ సింగిల్‌విండోలో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. దీనికోసం రెవెన్యూ, పురపాలక, జల వనరులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్‌ తదితర విభాగాలు సంయుక్తంగా పని చేయాలని సూచించారు. ఆయా శాఖల వసూలు చేసే బిల్లులు సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానం ఉండాలన్నారు. వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జమ అయ్యే విధానాన్ని రూపొందించాలన్నారు. ఈ క్రమంలో ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్‌ సర్వే చేయాలనీ, దీనికోసం మరింత సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. అనుమతుల ప్రక్రియలో అనవసరమైన జాప్యాన్ని నివారించాలనీ, ఏ కారణం లేకుండా అనుమతులను నిరాకరించడానికి వీల్లేదన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా
లోపాలు ఉంటే వాటిని దరఖాస్తుదారులకు తెలియజేసి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులే సూచించేలా నూతన విధానం ఉండాలని తెలిపారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, హెదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎమ్‌డీ అశోక్‌రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ అలీ, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ ఇ.వి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -