రిజిస్ట్రేషన్ల రెన్యూవల్‌కు..
150 క్రెడిట్ పాయింట్ల విధానం రద్దు చేయాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలనీ, క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. క్వాలిఫైడ్ నర్సుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు ఐదేండ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదని అభ్యంతరం తెలిపారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యంతో తెలంగాణలో 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
క్వాలిఫైడ్ నర్సులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేండ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మందికి అవగాహన లేదని కవిత తెలిపారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని తనను కలిసిన పలువురు నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు. నర్సింగ్ కేవలం వృత్తి మాత్రమే కాదు సేవ చేయడమనీ, రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం సేవలందించే నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ విషయంలో ఇలాంటి కఠిన నిబంధనలు సరికాదని పేర్కొన్నారు.
ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్‌లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదని కవిత స్పష్టం చేశారు. కరోనా కాలంలో నర్సింగ్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించలేదనే విషయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌కు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. ఐదేండ్లకు 150 క్రెడిట్ పాయింట్ల విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్సులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.
నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



