– రోడ్డెక్కిన పండ్ల వ్యాపారులు
– రెండు గంటలకు పైగా రాస్తారోకో
– రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాలని అధికారులు ఒత్తిడి
నవతెలంగాణ- మిర్యాలగూడ
”ఎన్నో ఏండ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం.. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో మా బతుకులను రోడ్డుపాలు చేయజూస్తున్నారు.. బండ్లను తొలగించి మా పొట్ట కొట్టొద్దు..” అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో గురువారం పండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. స్థానిక పొట్టిశ్రీరాములు చౌక్ వద్ద రెండు గంటలకు పైగా రాస్తారోకో చేశారు. రోజంతా రోడ్డుపై నిల్చొని వ్యాపారం చేసుకుంటే అన్నీ పోను ఐదారు వందలు మిగులుతుంది.. కొన్నిసార్లు గిరాకీ లేక తెచ్చిన సరుకు పాడై నష్టపోతున్నాం.. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరిట పండ్ల బండ్లు తొలగించాలని పోలీస్, మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు.. రెండ్రోజులుగా మా బండ్లు రోడ్డుపై ఉండకుండా వేధిస్తున్నారు. మాకు ఈ అడ్డాలే దిక్కు.. ఇది లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఎమ్మెల్యే, కమిషనర్ రావాలని, మా అడ్డాలు మా ఉంచేవిధంగా చూడాలని, మాకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపైనే పండ్లు పోసి నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో అడ్డాలు తమకే ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను చూసుకుంటానని నమ్మపలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అడ్డాలు తొలగించాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల బండను వెనక్కి పెట్టుకోవాలని పోలీసులు, మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని, వెనక్కి వెళ్తే షాపుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ముందుకు పోతే పోలీసులు, మున్సిపల్ అధికారుల వేధింపులు, వెనక్కి పోతే షాపుల యజమానుల ఒత్తడి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తమ పట్ల అవమానకరంగా మాట్లాడినందుకు ఆందోళనకు దిగాల్సిన వచ్చిందన్నారు.
ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమణ
సాగర్ రోడ్డుపై పండ్ల బండ్లు యథావిధిగా పెట్టుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్లు షేక్ జావిద్, జానీ, ఆలగడప గిరిధర్ తెలిపారు. ప్రస్తుతం డీఎస్పీ అందుబాటులో లేనందున శుక్రవారం సాయంత్రం వరకు బండ్ల తొలగింపులు నిలిపివేయాలని పోలీసులకు చెబుతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే హామీతో చిరు వ్యాపారులు ఆందోళన విరమించారు.
40 ఏండ్లుగా పండ్లు అమ్ముతున్నా: మరియమ్మ
సాగర్ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద 40ఏండ్లుగా పండ్లు అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నాను. నేను, నా భర్త, పిల్లలు ఈ బండి పైనే ఆధారపడి ఉన్నాం. రోజంతా కష్టపడితే ఐదారు వందలు మాత్రమే వస్తాయి.
ఇప్పుడు బండ్లు తీసేయాలంటూ పోలీసులు, మున్సిపల్ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బండి తీసేస్తే కుటుంబమంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు న్యాయం చేయాలి.
మా అడ్డా మాకే ఉండేలా చూడాలి : బుజ్జి
నేను స్థానిక ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట 35 ఏండ్లుగా అరటిపండ్ల బండి నడుపుతున్నాను. మా బండి రోడ్డుకు చాలా దూరంలో ఉన్నది. ఐనా రోజూ పోలీసులు, అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఇటీవల పోలీసులు నా బండిపై ఉన్న సరుకును బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో 10 వేలకు పైగా నష్టం వచ్చింది. ఇప్పుడు సరుకు తెచ్చుకున్నాక మళ్లీ బండి తీసేయమంటున్నారు. బండి నడవకపోతే నా కుటుంబం ఎలా బతకాలి?
మా పొట్ట కొట్టొద్దు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES