Friday, October 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంషట్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులను తొలగించొద్దు

షట్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులను తొలగించొద్దు

- Advertisement -

ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఫెడరల్‌ జడ్జి
శాన్‌ ఫ్రాన్సిస్కో : ప్రభుత్వ షట్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో ఉద్యోగులను తొలగించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ఫెడరల్‌ జడ్జి అడ్డుకున్నారు. షట్‌డౌన్‌ కొనసాగినంత కాలం ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. నాలుగు వేల మంది ప్రభుత్వోద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం ఐదు రోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను నిలిపివేస్తూ న్యాయమూర్తి బుధవారం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. అంతేకాక తొలగింపులను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన రెండు కార్మిక సంఘాలకు చెందిన సభ్యులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకూడదు.

ప్రభుత్వం చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని శాన్‌ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు న్యాయమూర్తి సుసాన్‌ ఒన్నే ఇల్‌స్టన్‌ స్పష్టం చేశారు. చట్టాలు అమలవుతున్న దేశంలో ఇలాంటి పనులు చేయకూడదంటూ ప్రభుత్వంపై అక్షింతలు వేశారు. ‘మనకు చట్టాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన పనులు చట్టానికి లోబడి లేవు’ అని వ్యాఖ్యానించారు. షట్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులను ఇంటికి పంపడం అసాధారణ చర్య అని అన్నారు. ప్రతిపక్ష పార్టీని అప్రదిష్టపాలు చేయడానికి ఉద్యోగుల తొలగింపును ఓ మార్గంగా ఎంచుకోవడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదని చురక వేశారు. కాగా ఉద్యోగుల తొలగింపును వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన రెండు కార్మిక సంఘాల్లో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -