కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరాలి
ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలి
ఆధారాలన్నింటినీ న్యాయ నిపుణులకు ఇవ్వండి
విచారణలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారు
న్యాయనిపుణులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నికర, మిగులు, వరద జలాలు ఏదైనా సరే కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాలో చుక్కబొట్టును కూడా వదులకుండా సాధించి తీరాలనీ, తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునే ందుకు కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని న్యాయనిపుణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విచారణకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్వయంగా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. అందులో మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మెన్ కె.వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనా థ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంవో కార్యద ర్శి మాణిక్‌రాజ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
904 టీఎంసీల కోసం పట్టుబట్టండి
ఇంతకాలం కష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్‌కు సమర్పించాలని సీఎం సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించటంతో ఈ పరిస్థితి వచ్చిందన్నా రు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తి ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని
కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ప్రస్తావించారు.
గత సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందనే విషయాన్ని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృష్ణాపై తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్‌లో పెట్టి నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందనీ, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మళ్లింపులపై వాదించండి
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తున్నదనీ, ఇతర బేసిన్లకు తరలించుకుపోతున్నదని ఎత్తిచూపారు. ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నింటినీ ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నదని తెలిపారు. వాటిని కూడా ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించాలన్నారు.
హక్కులున్నారు..అర్హతలున్నారు
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట, కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు, కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని న్యాయ నిపుణులకు సీఎం సూచించారు.