ఆధారాలుంటే గాంధీ భవన్‌కు రండి.. చర్చిద్దాం..
నేను సిద్ధం.. మీరు సిద్ధమా…? ‘నాదర్‌గుల్’పై బీఆర్‌ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదేసినట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. వారి దగ్గర ఆధారాలుంటే గాంధీ భవన్‌కు రావాలని సూచించారు. ఈ అంశంపై ఎంతసేపైనా చర్చించేందుకు తాను సిద్ధమని.. బీఆర్‌ఎస్ నేతలు రెడీనా..? అని ఆయన ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రి పొంగులేటిపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్న బీఆర్‌ఎస్ నేతలు నాదర్‌గుల్ భూముల వ్యవహారంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వాస్తవానికి ఆ కుంభకోణం కేసీఆర్ హయాంలోనే జరిగిందని ఎద్దేవా చేశారు.
తమ పార్టీని కాదని బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ వాస్తవాన్ని మరిచిన ఆయన… ఇప్పుడు పార్టీ మారటమేగాక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని పదవి నుంచి దిగిపోవాలని చెప్ప టానికి ఆయనెవరని ప్రశ్నిం చారు. జీవన్ రెడ్డి మాటలను ప్రజలెవ్వరూ పట్టించుకో వటం లేదన్నారు. ఆయన కాంగ్రెస్‌ను విమర్శించే ముందు గతంలో బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలను గుర్తుకు తెచ్చుకోవాలని చురకలంటిం చారు. గులాబీ పార్టీ, కమలం పార్టీ వేర్వేరు కాదని.. మున్ముందు అవి కలవటం ఖాయమని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని తెలిపారు. అది ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని వ్యాఖ్యానించారు.
ఘనంగా ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ వేడుకలు…
ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థి రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్మిస్తాయని తెలిపారు. యువ నాయకత్వం తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనేక మంది జాతీయ స్థాయి నేతలు ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. నిత్యం ప్రజలతో మమేకమవటం ద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఎన్‌ఎస్‌యూఐ లాంటి సంస్థలు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకుంటే తమలాంటి వారికి రాజకీయ అవకాశాలు వచ్చేవే కాదన్నారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలంటూ ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు. అవి జరిగితే పరిపక్వత కలిగిన యువ నాయకత్వం రాజకీయాల్లోకి వస్తుందని వివరించారు.



