– మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉన్న నీరా కేఫ్‌ను ప్రయివేటు చేయొద్దని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నీరా కేఫ్‌ను ఎత్తేసే పనిలో ఉందన్నారు. దాన్ని ప్రయివేటుపరం చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నీరా కేఫ్‌లను కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలని కోరారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నీరా కేఫ్‌ల వల్ల 10 కులాలకు పని దొరుకుతుందని చెప్పారు. గీత పారిశ్రామిక సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. రాష్ట్రంలో వైన్ షాపులను సొసైటీలకు కొంత శాతం కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో గౌడన్నలకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందనీ, ఏ ఒక్క హామీ నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులపై దాడి చేస్తున్నదనీ, వాటిని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమలో కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు నాగేందర్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె కిషోర్‌గౌడ్, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
నీరా కేఫ్‌ను ప్రయివేటుపరం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



