”ఎంత చదివితే మాత్రం ఏమున్నది గర్వకారణం” అంటూ శ్రీశ్రీ గారి కవిత్వానికి పేరడీ చెప్పుకుంటూ పక్కదారి పట్టి, కెరీర్ వెదుక్కోవడంలోను, ‘కెరీర్’ను ఏర్పరచుకోవడం లోను ఘోరంగా విఫలమవుతూ వున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ స్థాయిలోనే చదువుకు ‘బై బై’ చెప్పేసి, ”నేను సైతం…” అంటూ తయారైపోవడం ఈ మధ్య మరీ ఎక్కువై పోయింది. డ్రాప్ అవుట్స్ విషయానికి వస్తే మన దేశంలో, విద్యార్థి జీవితంలో ప్రతి దశలోనూ ఇది గణనీయమైన స్థాయిలో వుంది. దీని ఒరవడి ఏడో క్లాసులోంచే మొదలవుతుందటే అతిశయోక్తి కాదు. వాతావరణం సరిగ్గా లేకపోవడం కానీయండి, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు కానివ్వండి….. మరింకేదయినా కానివ్వండి. చదువు కాకపోతే ఏమిటి? అనే ఆలోచన ఏడోతరగతిలోనే విజంభిస్తోంది. అప్పట్నుంచి, పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఇలా పలు దశల్లో, కీలకమైన మలుపుల్లో, విద్యార్ధులు, అలసిపోయి, డస్సిపోయి ట్రాక్ వదిలేసి, ఆ పక్కనే వున్న, కోట్లాది మంది నిరుద్యోగుల గుంపులో చేరిపోతున్నారు.
పరిపక్వతలేని తనం: టీనేజీ వయసులో సహజంగా, తల్లిదండ్రులతో ఏర్పడే వేర్పాటు ధోరణి నాకాళ్ళమీద నేను నిలబడతాను అనే రోషం, చదువుమీద ముందునుండీ ఆసక్తి అంతగా లేకపోవడం, ఎడతెరిపిలేకుండా ఫెయిలయిపోతూ రావడం, ఎదిగిపోతున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు, హార్డ్వేర్ జాబ్లు, కంప్యూటర్ సంబంధిత రంగాలు, వాటిలో ఉద్యోగాలు నోరూరించడం ఇంత సువిశాల ‘ఇన్ఫోసిస్’లో ‘మన’ టాలెంట్‌కు సంబంధించింది చిన్నదో. పెద్దదో ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోతుందా..? లైఫ్‌లో సెటిల్ కాలేకపోతామా అని వెంపర్లాడటం మొదలైన నిరాధార అభిప్రాయాలు ”క్విట్ ఫ్రమ్ కాలేజీ” ఉద్యమానికి ఊపిరిపోస్తున్నాయి.
హెవీ రష్ :
అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించినట్లు, కాళ్ళల్లో సత్తువ రాకుండానే మరథాన్ రేస్లో పాల్గొన్నట్లు, ఇంటర్ మానేసి ”జాబ్” లో ఎంటర్ అయిపోవడం, జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోయే సిటీబస్, స్టాపు… స్టాపుకు నెలలు నిండుతున్న గర్భిణీలా మారిపోవడం లాంటిది. దీనివల్ల, నిరుద్యోగుల కూటమిలో మరింత రష్ పెరిగిపోవటం తప్ప, ప్రయోజనం శూన్యం. దీంతో మరో చిక్కు కూడా వుంది. రష్ పెరగడం వల్ల పోటీ పెరిగిపోతుంది. దాంతో వెయ్యిరూపాయిలు జీతం దొరికే ఉద్యోగాన్ని అయిదు వందలైనా సరే…. చేరిపోదాం అని దిగజారి, అంగీకరించవల్సి వస్తుంది. టాలెంటును పెంచుకునే, అవకాశం వుండీ, ”వ్యవస్థగా బతకాలని అనుకుంటున్నాను” అని ప్రగల్భాలు పలికే కుహనా, మాడర్న్ ఫ్యూడలిస్టు చేతుల్లో పావుల్లా మారిపోయే ప్రమాదానికి ‘ఇంటర్’ విద్యార్థులే స్వాగతం చెబుతున్నారు.
గతిలేక కొందరు :
ఆసక్తి లేక కొందరు అలా మారిపోతూవుంటే, ఆర్థిక సమస్యల కారణంగా మరికొందరు ఇంటర్‌లోనే చదువు నిలిపేస్తున్నారు! ఇట్లా తప్పనిసరి పరిస్థితులలో, ఏదో ఒక జాబ్‌లో చేరిపోవడం తప్పుకాదుగానీ, ఈ విధంగా తలదూర్చిన ‘జాబ్’ తమను అల్లావుద్దీన్ అద్భుతదీపం దగ్గరకు తీసుకువెళ్తుందని కలలు కనడం మంచిది కాదు. ఇక్కడ ముఖ్యంగా, ఇంటర్ విద్యార్థులు ఆలోచించవల్సింది, ఉద్యోగంలో తాము శ్రమించవల్సిన పనిగంటలు ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది దాకా పనిచేయించుకుని, పన్నెండొందలు జీతం విసిరేసే బడాబాబులే ఎక్కువ. ఈ నేపథ్యంలో గతిలేక వుద్యోగంలో చేరిన ఇంటర్ విద్యార్థుల జీవితాలు వికసించే స్థితిలోనే నలిపివేయబడుతున్నాయి.
తెలివిగా వ్యవహరించండి :
ఇక్కడే, ఈ కోవకు చెందిన విద్యార్థులు తెలివిగానూ, ప్రణాళికా బద్ధంగానూ వ్యవహరించాలి. జీతం తక్కువైనా ఫర్వాలేదు పరిమితమైన పనిగంటలు మాత్రమే పనిచేయాలి. అలా మిగిల్చిన కాలాన్ని, విద్యార్థులు మరింత ఎక్కువ విజ్ఞానాన్ని, ‘డబ్బు సంపాదించగల నేర్పును’ అందించే విజ్ఞానాన్ని గడించటానికి వెచ్చించాలి. ‘కొంచెం డబ్బు… కొంచెం తెలివి’ చందంగా కొంతకాలంపాటు, ఉద్యోగాలు చేసి, ఏదో ఒక శాఖలో, ప్రభావితం చేయదగ్గ, ఆధిపత్యం చూపించదగ్గ సత్తాను ఏర్పరచుకోవడం మంచిది. డబ్బు సంపాదించి తీరవల్సిన సమస్యలు లేని విద్యార్థులు, కెరీర్‌ని ఎంచుకునేటపుడు, మీ ఎంపిక ఉన్నతమైనదిగానూ, ప్రయోజనకరమైనదిగాను వుండాలంటే అందుకు తగిన మానసిక పరిపక్వత… ఈ ‘ఇంటర్’ స్థాయిలో మీకు ఏర్పడి వున్నదా లేదా అన్నది ఆలోచించాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



