Saturday, December 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి

ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి

- Advertisement -

నర్సంపేటకు మరో 3,500 ఇండ్లు
జీవితాలను మార్చేది చదువే
ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌కే..
మార్చి 31లోపు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌
నర్సంపేటలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 31లోపు వరంగల్‌ ఎయిర్‌పోర్టుతోపాటు అండర్‌గ్రౌండ్‌ డ్రయినేజీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. శుక్రవారం వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’లో సీఎం పాల్గొని రూ.530.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత రెండో నగరమైన వరంగల్‌ను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయడానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు.

డిసెంబర్‌ చివరి వారంలోపు మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31లోపు పనులు ప్రారంభిస్తామన్నారు. 2004లో వైఎస్‌ సీఎంగా ఉచిత విద్యుత్‌ పథకంపై తొలి సంతకం పెట్టారని గుర్తుచేశారు. రూ.1,200 కోట్లు పాత బాకీలను మాఫీ చేసి నాడు రైతులపై ఉన్న క్రిమినల్‌ కేసులను కూడా మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఒకే పంటలో రాష్ట్రంలో కోటీ 56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. రాష్ట్రం ప్రతియేటా రూ.13 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా ప్రతి పేదవాడికి సన్నబియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా అందిస్తున్నట్టు తెలిపారు.

‘డబుల్‌’ ఇండ్లు ఇవ్వని కేసీఆర్‌ ప్రభుత్వం
2014లో తెలంగాణ రాష్ట్రం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డా కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని సీఎం విమర్శించారు. నర్సంపేట నియోజక వర్గంలో ఎవరికన్నా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇవ్వలేదంటూ ప్రజలు గొంతెత్తారు. తాము ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని చెప్పుకుంటూ ధైర్యంగా ఓట్లడుగు తున్నామన్నారు. వరంగల్‌లో గుడిసెలుండవంటూ గత పాలకులు ఉన్న గుడిసెలను కూలకొట్టి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని, కల్లు తెచ్చి, కోడి కోసుకొని దావత్‌ చేసుకుందామని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని, వచ్చే ఏప్రిల్‌లో మరో 3,500 ఇండ్లను ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు.

ఆర్థిక భరోసా ఇచ్చేలా మహిళలకు రుణాలు
మహిళలకు రూ.25,500 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. పెట్రోల్‌ బంకులు, సోలార్‌ ప్లాంట్లు, ఆర్టీసీ ప్రయివేటు బస్సులు.. మహిళా సంఘాలకే ఇచ్చి కోటీ మంది మహిళలను కోటీశ్వరులుగా చేయబోతున్నామని తెలిపారు. చదువే మీ జీవితాలను మారుస్తుందని, మీ బిడ్డలను బాగా చదివించండని మహిళలకు పిలుపునిచ్చారు. పిల్లలు ఆ చదువు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తానన్నారు. అలాగే, రాష్ట్రంలో కోటీ మంది మహిళలకు చీరెలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 65 లక్షల చీరెలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేసినట్టు చెప్పారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు చీరెల పంపిణీ చేస్తామన్నారు. ‘మెప్మా’ ద్వారా ఈ కార్యక్రమం నగరాలు, పట్టణాల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. రేవంతన్న పెట్టిన చీరెతో ప్రతి ఆడబిడ్డా సారె పండుగ జరుపుకోవాలని, ఈ బాధ్యతను మంత్రులు సురేఖ, సీతక్క తీసుకోవాలన్నారు. సీఎం సభా వేదిక నుంచే రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఎవరికన్నా చీరె రాలేదని తెలియచేస్తే తానే స్వయంగా చీరె పంపుతానని స్పష్టంచేశారు.

హాఫ్‌కో.. ఫుల్లుకో ఓట్లు అమ్ముకోవద్దు
హాఫ్‌కో, ఫుల్లుకో ఓట్లు అమ్ముకోవద్దని, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా.. ప్రజల మనస్సు గెలుచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలు రిఫరెండెమ్‌ అని మాట్లాడితే.. అక్కడి ప్రజలు ఆయన్ను బండ కేసి కొట్టి బొందపెట్టారన్నారు. అయినా సిగ్గులేక మళ్లీ తిరుగుతున్నాడ న్నారు. తాను ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు ఎన్నిసార్లయినా తిరుగుతానని, తనకు వయస్సుందని తెలిపారు. పదేండ్లపాటు నియామకాలు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 61,379 మందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని యువతకు పిలుపుని చ్చారు. మేడారంలో కొత్త సంవత్సరంలో సమ్మక్క- సారలమ్మ జాతరకు వస్తానన్నారు.

మేడారంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్‌, విప్‌ రాంచందర్‌నాయక్‌, ప్రభుత్వ సలహదారు వేం నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మెన్‌ ఎండీ రియాజ్‌, ఎమ్మెల్సీలు బస్వరాజ్‌ సారయ్య, శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌ నాగరాజు, మురళీనాయక్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షులు మహ్మద్‌ అయూబ్‌, లకావత్‌ ధనవంతి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -