Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅవాస్తవాలు మాట్లాడొద్దు

అవాస్తవాలు మాట్లాడొద్దు

- Advertisement -

వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇండ్లు కట్టివ్వాలి
లేకుంటే కాంగ్రెస్‌ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్లలో దాదాపు 700 కుటుంబాలు పదేండ్లుగా భూదాన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో, బుల్డోజర్లతో బలవంతంగా ఇండ్లను కూల్చేయటం దారుణం. అక్కడ ప్రజలు రోడ్లమీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బుల్డోజర్‌ రాజ్యాన్ని నడుపుతోందని ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి… ఇదంతా అవాస్తవమని, కేరళ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారనడం సరైందికాదు. సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అవాస్తవాలు మాట్లాడొద్దు’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు.

వెలుగుమట్ల బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వెలుగుమట్లలో ఎంత విధ్వంసం జరిగిందో, ఆ కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. శిబిరాల్లోని పేదలకు కనీస సౌకర్యాలు కూడా లేవనే వార్తలు ఎలక్ట్రానిక్‌ మీడియాలో, పత్రికల్లో వస్తున్నాయి. అక్కడకెళ్లిన మీడియా వారిని కూడా అరెస్టు చేసి, నిర్బంధిస్తున్నారు’ అని తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నది వాస్తవం కాదా? ఆ ఎంపీకీ ఆ పోరాటాలు కనపడటం లేదా? వెలుగుమట్ల బాధితుల గోడు వినపడటం లేదా? అని ప్రశ్నించారు.

ఆ ఎంపీ ఊహాగానాలతో మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే పనిలో ఉందనీ, పేదలకు ఇండ్లు కట్టిస్తున్నదని తెలిపారు. అక్కడ అందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందిస్తూ నిరుద్యోగ నిర్మూలనకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నదనీ, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద ప్రజల పక్షాన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నిలుస్తోందని వివరించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతూ విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. వాటన్నింటినీ ఎదుర్కొని కేరళ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -