”నన్ను ర్యాంక్ రోబోలా మార్చేశారు మేడం”… ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి నా వద్దకు వచ్చింది. ఆమె వయస్సుకు తన కళ్లలో ఉత్సాహం కనిపించాలి. కానీ ఆమె ముఖాన్ని చూస్తే… అలసట, భయం, అసహనం, ఇంకా లోతుగా చూస్తే… నిస్సహాయత.
తల్లిదండ్రులు బాధగా చెప్పారు… ”మేడం, మా పిల్ల చదవడం లేదు. ఎంత చెప్పినా వినడం లేదు”
ఆమెను ఒంటరిగా మాట్లాడించాను. ఆమె నిశ్శబ్దంగా, కానీ లోతుగా ఇలా చెప్పింది… ”మేడం, నేను చదవడం ఆపలేదు. నేను బతకడం ఆపాను”
ఆ మాట ఒక్కటే నా మనసును కదిలించింది.
”ఎన్ని మార్కులు వచ్చినా సరిపోదు. ఎన్ని ర్యాంకులు వచ్చినా చాలదు. నన్ను చూసి నవ్వే అమ్మానాన్న ఇప్పుడు మార్కులే చూస్తున్నారు. నన్ను ర్యాంక్ రోబోలా మార్చేశారు మేడం”
ఈ చిన్నారి మన సమాజానికి గొప్ప ప్రశ్న వేసింది – పిల్లల్ని మన లక్ష్యాలకు బానిసలుగా తయారు చేస్తున్నామా? చదువు పేరుతో మనసుల్ని బంధిస్తున్నామా?
నేడు టెక్నాలజీ అభివద్ధి చెందినా చిన్న అపజయం వచ్చినా యువత ఆత్మహత్యల దిశగా పయనిస్తోంది. ఇది విజయం దిశలో కాదు – గమ్యం కోల్పోయిన వినాశక దారిలోకి తీసుకెళ్తోంది.
చదువు పుస్తకాల్లో కాకుండా జీవితంలో గెలవడానికి ఉపయోగపడాలి.
పిల్లలకు చదవాలనిపించాలి భయంతో కాదు, ఆశతో. ప్రేమతో నేర్పితే పాఠం గుండెల్లో నిలుస్తుంది – ఒత్తిడితో కాదు. గెలుపు ఒక్కటి నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి మనకు నేర్పుతుంది. వైఫల్యాన్ని ఎదుగుదలకే అడుగుగా తీసుకోవాలి.
పరీక్షల ఫలితాలు ఒక ప్రయాణంలోని దశలు మాత్రమే. గమ్యం చేరడమే ముఖ్యమైందని గుర్తించాలి.
తల్లిదండ్రుల బాధ్యత చాలా కీలకం:
వారు మార్కులకు కాదు, పిల్లల మనోభావాలకు విలువ ఇవ్వాలి. తప్పులు జరిగితే వారిని గద్దించకండి, ప్రేమ తో వివరించండి. అందరికి విజయం ఒకేసారి రాదు. కానీ అందరినీ ప్రేమించడం మాత్రం మన బాధ్యత.
ఇప్పుడు సమాజం ఇలా మారింది:
ఒక్కసారి పాసైతే చాలు అనేవాళ్లు
ఇప్పుడు ”ఎన్ని మార్కులు?”, ”ఇంకా పెరిగినా బావుండేది!” అని..
పదవ ర్యాంకైనా చాలదు అనిపించే స్థితి..!
సంతోషం ఒక్క క్షణం నిలవదు. గర్వం మొహంలో కనిపించదు. సంతప్తి వినిపిస్తుంది కానీ చూపించలేరు.
వాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతున్నారా?
లేదండి… మనమే వాళ్లను దూరం చేస్తున్నాం!
వాళ్లను ఓ చదివే యంత్రాల్లా మార్చేశాం. ర్యాంకుల ప్రింట్లే లక్ష్యమయ్యాయి.
ఆమె చివరిగా అన్న మాట…
”నన్ను బతికించండి మేడం, చదువు మధ్యలో కాకపోతే నేను అంతమైపోతాను”
ఈ మాటల్లో ఒక దేశపు బాధ దాగి ఉంది. ఇది ఒక్క విద్యార్థి కాదు, వేలాది పిల్లల మనస్సులోని మౌనం!
విద్యార్థి అనే పదం ఇప్పుడు గుర్తింపు కార్డుకే పరిమితమైంది.
విద్య అనే ప్రయాణం ప్రేమతో ఉండాలి, ఉల్లాసంగా సాగాలి.
ప్రతీ విద్యార్థికి తన లక్ష్యం నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. తాత్కాలిక ఫలితాలకు కాదు – స్థిరమైన అభివద్ధికి నడిపే మార్గం అవసరం.
ప్రభుత్వం విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై దష్టి పెట్టాలి.
ప్రతి పాఠశాలలో కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
తల్లిదండ్రులకు మార్గనిర్దేశన అవసరం.
పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాం గాని, ప్రేమ ఇవ్వడం మర్చిపోతున్నాం. మార్కులే గమ్యం కాదు.. మానవత్వం, సమతా భావం, ఆత్మస్థైర్యమే అసలైన విజయం.
వైఫల్యం బంగారు గని లాంటిదే.
దాని లోతుల్లోనే మన పిల్లల నిజమైన బలాలు దాగి ఉంటాయి.
మన బాధ్యత: వాళ్లను ర్యాంక్ రోబోలుగా కాక, స్వతంత్ర ఆలోచనతో గెలిచే మానవులుగా తీర్చిదిద్దుదాం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
ర్యాంక్ రోబోలుగా మార్చొద్దు…
- Advertisement -
- Advertisement -