ప్రియమైన వేణు గీతికకు
ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్లి నీ వర్క్ విజయవంతంగా పూర్తిచేసుకొని వచ్చినందుకు చాలా సంతోషం. ఈ రోజు అమ్మ ఏం చెప్తుంది అని ఎదురు చూస్తున్నావా? ఈ రోజు నీకు ప్రతికూల ఆలోచనల గురించి (negative thinking) చెప్తాను. చిన్నప్పుడు నువ్వు హిందీలో నకారాత్మక్ సోచ్, సకారాత్మక్ సోచ్ గురించి రాసేదానివి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే.
నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, మన బంధువుల్లో కూడా ఉన్నారు. ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు. ఆ ఆలోచనల తో వాళ్ళు చేసే పనులు చూస్తుంటే నాకు చాలా వింతగా, విచిత్రంగా ఉండేది. వెలుతురు పనికి రాదు, ఇంట్లోని తలుపుల న్నీ మూసి ఉంచుతారు. బాల్కనీలో చేసే పనులు బైట ఎవరికీ కనపడకుండా ఉండాలని దుప్పట్లు, రగ్గులు వేసి ఉంచుతారు. ఇంటికి గ్రిల్స్ ఉంటే వాటికి తాళం వేసుకుంటారు. రాత్రి పూట ఏదో చిన్న పాటి వెలుతురు(నైట్ బల్బు) కాంతిలో భోజనం చేయడం, కూర్చున్న గదిలో వేసిన లైట్ బైటకు రాకుండా తలుపు వేసుకోవడం ఇవన్నీ కూడా ప్రతికూల ఆలోచనలే.
ఎక్కడైనా కార్ పార్క్ చేస్తే దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారని భయం. వెలుతురు అంటే భయం, చీకటిలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి వాళ్లు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోలేరు. అసలు వీళ్లకు నిజం మాట్లాడటం కూడా రాదు. ఎందుకంటే అబద్ధం కూడా ప్రతికూల ఆలోచనే. ప్రతిదానికీ అబద్ధం చెబుతారు. ‘ఇలా ఆలోచిస్తూ మనుషులు ఎలా బతుకుతారో’ అనే సందేహం వస్తుంది. అయితే వాళ్లు తమవే సరైన ఆలోచనలు అనుకుంటారు. కుటుంబంలోని వాళ్లంతా అలాగే ఉన్నప్పుడు ఇక వాళ్ళను సరి దిద్దేవాళ్ళు ఎవరుంటారు?
వీళ్లకు ప్రతీదీ తప్పుగానే కనిపిస్తుంది. వీరి ఎదురుగా ఇతరులను మెచ్చుకుంటే భరించలేరు. జీవితాన్ని ఆనందంగా గడపలేరు. ఒక గీత గీసుకుని అందులోనే బతుకుతారు. అది దాటి బైటకు రావడానికి ఇష్టపడరు. అదొక్కటే కాదు అందరూ వీరికి నచ్చిన విధంగా, వీరు చెప్పినట్లు చేయాలనుకుంటారు. ఇటువంటి ప్రతికూల ఆలోచనల వల్ల మనసంతా కకావికలం అయిపోతుంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి వారితో స్నేహం, బంధుత్వం రెండూ ప్రమాదమే. ఇలాంటి ఆలోచనల తో జీవితంలో, వృత్తిలో ఎదగలేరు. ఇది ఒక భయంకరమైన మానసిక జబ్బు. వీళ్ళతో తక్కువగా మాట్లాడటం లేదా దూరం గా ఉండటం మేలు. పెద్దలు కీడెంచి మేలెంచమని అన్నారు. కానీ ప్రతి విషయంలోనూ కాదు. కొన్ని సందర్భాలను, సంఘట నలను బట్టి ఆ విధంగా ఆలోచించాలి. అందుకే నీ జీవితంలో ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు రానివ్వకు. అవి ఎప్పటికీ నష్టాలను కలిగించడమే కాక, మనసుని ప్రశాం తంగా ఉండనివ్వవు. వచ్చేవారం నిన్ను చూడబోతున్నందుకు సంతోషంతో..
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి
ఆ ఆలోచనలు వద్దు
- Advertisement -
- Advertisement -