Sunday, June 22, 2025
E-PAPER
Homeసోపతికాలాన్ని వృధా చేయకు... !

కాలాన్ని వృధా చేయకు… !

- Advertisement -

కాలం అమూల్యమైనది. అలా అని అది కిరాణ కొట్టులో దొరికే వస్తువు కాదు. చేజారిన కాలం మళ్ళీ రాదు. రాబోయే కాలం ఎలా వుంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకవేళ మీరు ఏదైనా ప్రణాళికను వేసుకొని దానికనుగుణంగా రేపటి నుండి ప్రారంభిద్దానుకుంటే పొరపాటు. అది ఈరోజే ప్రారంభించండి. మహాత్మగాంధీ కాలం గూర్చి చెప్తూ ‘రేపు చేసేది ఈరోజే చేయండి, ఈరోజు చేసేది ఇప్పుడే ప్రారభించండి’ అంటారు. అంటే కాలం విలువ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. టైమ్‌ తన పనిని రాత్రి 12:00 గంటలకి ప్రారంభిస్తుంది. తిరిగి 0:00 గంటలకి ముగుస్తుంది. కాలం వర్తమానంలో వున్న మనల్ని భవిష్యత్తులోకి వెళ్ళనివ్వదు. అలాగని గతంలోకీ వెళ్ళనివ్వదు. అంటే వున్న సమయాన్ని ఉన్న పళంగా సద్వినియోగం చేసుకోవాలి. లేని పక్షంలో రేపటికి ఈ భూమిపై మీ ఆనవాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు, లేదా మీ మనస్సు మారిపోవచ్చు. అందుకే ఏదైనా అనుకున్న మరుక్షణమే ఆ పనిని ప్రారంభించండి. దాని ఫలితాన్ని ఆస్వాదించండి.

ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి ఒక్కరోజులో ఖర్చు చెయ్యాలి లేని పక్షంలో మీ వద్ద నుండి అవి మాయం అవుతాయంటే మీ మానసిక స్థితి ఎలా వుంటుందో ఒకసారి ఆలోచించండి. డాక్టర్‌ మిమ్మల్ని కేవలం ఒక వారం లేదా నెల రోజులు లేదా ఒక సంవత్సరం మాత్రమే బతుకుతారని చెబితే అప్పుడు మీరు ఆ రోజులను ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మీ, మీ చుట్టూ వున్న వారి మానసిక ఉద్వేగాలు ఎలా ఉంటాయో ఓ సారి అంచనా వేసుకోండి.
మీ దగ్గర ఎన్ని వందల కోట్లు వున్నా, మీ బ్యాంకు డిపాజిట్లో ఎన్ని మిలియన్‌ డాలర్లు వున్నా మీ దగ్గర లేనిది, మీరు నియంత్రించలేనిది సమయం. అంతటి విలువైన కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామనేది మన చుట్టూ వున్న పరిస్థితులపైన ఆధారపడి వుంటుంది. కాబట్టి ముందుగా మనస్సును నియంత్రణలో పెట్టుకొని చుట్టూ వున్న పరిస్థితులను మన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే కచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రపంచంలో సంపన్నులుగా పిలువబడే వ్యక్తులను ఎవరినైనా పరిశీలించి… వారి దిన చర్యలను ఓసారి పరిశీలించండి. వారు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో, వారి సమయ నిర్వహణ, రోజువారి ప్రణాళిక ఎలా వుంటుందో చూడండి. అప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతటి శ్రమ వారు చేయటం మూలంగానే ఈ స్థాయికి వచ్చారన్న వాస్తవం మరువకండి. మరి మీకూ వారికీ తేడా ఏమిటో ఈ పాటికే అర్ధమై వుంటుంది. జీవితంలో తిరిగి సంపాదించుకోలేనిది మీ వయస్సు, కాలం. ఈ రెండు వెలకట్టలేనివి. వద్ధాప్యంలో వున్న వ్యక్తి యవ్వనం కోరుకుంటాడు. అది సాధ్యమవుతుందా? చనిపోయే వ్యక్తి బ్రతకాలనుకుంటాడు. అదీ సాధ్యం కాదు. కాబట్టి వున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనం చేయాల్సింది.Theory of Relativity లాగా మీరు కాలాన్ని చూసి భయపడితే అది ఎక్కువగా భయపెడుతుంది. కాలాన్ని అశ్రద్ధ చేస్తే మీరు చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. కాలాన్ని ఎవరైతే సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారో వారు చనిపోయినా బతికి వున్న వారిలో జీవించే వుంటారు. అందుకు గాంధీ, లింకన్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, కలామ్‌, నేతాజీ, ఐన్‌స్టీన్‌ ఇలా ఎవరినైనా తీసుకోండి… వారు జీవించిన కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఇంకా మన మధ్య వారి గూర్చి నిత్యం ఎక్కడో చోట చర్చ జరుగుతూనే వుంటుంది.
మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ఏడ్వాలంటే ఏడవండి, నవ్వాలంటే నవ్వండి. కానీ సమయాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు ఎవరినైనా ప్రేమించాలనుకుంటే ప్రేమించండి, సరదాగా గడపండి. ఎందుకంటే రేపటికి వాయిదా వేసుకుంటే అది జరగకపోవచ్చు. కాలం మీ కోసం ఆగదు. కాబట్టి సోమరిపోతులా మాత్రం కాలాన్ని వధా చేయకండి.
ప్రతిరోజూ, ప్రతి నిమిషం, ప్రతిగంటా, మీ సమయం ఎక్కడ వధా అవుతుందో పరిశీలించుకోండి. అలా దుర్వినియోగం అవుతున్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించుకోండి. వధాకు గల కారణాలు అన్వేషించి దానికి నివారణ చర్యలు తీసుకుంటే మీ కాలాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకున్న వారవుతారు.
కాలం ఎంత విలువైనదో మీకు పరీక్షల కాలంలో తెలుస్తుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో డైరీలో రాసుకోండి. చేయకూడనివి తగ్గిస్తూ వెళ్తే మీరు సరైన దారిలోనే వెళ్తున్నారని భావించాలి. మీ జీవితం కాలం 70 సంవత్సరాలు అనుకుంటే మీరు ఇప్పుడు ఏ వయసులో వున్నారో ఓసారి చూసుకోండి. ఇంకా ఎంత సమయం మీ వద్ద వుందో అంచనా వేసుకోండి. అలా మీరు చేరాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే మీరు ఎంత అశ్రద్ధ చేశారో మీకు ఈ పాటికే అర్ధమై వుంటుంది. ఇక మిగిలి వున్న కాలాన్ని మీ లక్ష్య సాధనకు చేరడానికి బాటలు వేసుకోండి. ఒకరోజులో 24 గంటలు తీసుకుంటే అందులో 8 గంటలు నిద్రకు 6 – 8 గంటలు మీరు చేసే పనికి. ఇక మిగిలిన సమయం మీరు ఏం చేయదల్చుకున్నారో మీ మెదడులో కచ్చితమైన ప్రణాళికను తయారు చేసుకోండి. అలా చేసుకుంటే మీరు ఆశించిన ఫలితాన్ని పొందగలరు.
అంతెందుకు నిద్ర లేవగానే మీకు ప్రతిరోజు 1440 నిమిషాల కాలం మీకు లభిస్తుందని మీకు తెలుసా? ఒకవేళ అవి రూపాయలైతే మీరు కచ్చితంగా ఉపయోగించుకునే వారు. మరి కాలన్ని కూడా రూపాయల మాదిరిగా పొదుపుగా వాడుకోండి. అంటే ఒకరోజులో మీకు 86400 సెకన్లు ఇవ్వబడుతున్నప్పుడు ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఓసారి ఆలోచించండి. ఇలా మీరు ఈ భూ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రతిరోజు 1440 నిమిషాలు విలువైన కాలం మీకు ఇస్తూనే వుంది. ఇంతకు మించిన విలువైనది ఇంకా ఏం కావాలి మీకు? ఇలా మీకు ఉచితంగా దొరికే సమయాన్ని గౌరవించాలని అనిపించట్లేదా? సహజంగా మన చుట్టూ వున్న వాళ్ళను ఎవరినైనా డబ్బులు అడగండి… ఇవ్వడానికి ఆలోచిస్తారు.
కానీ కాలం ఏమి అడగకుండానే మీకు 86400 సెకన్ల సమయం ప్రతిరోజు ఇస్తుంది. జీవితంలో సాధించడానికి ఇంత కన్నా ఏం కావాలి? ఐనా ఇంకా మీరు సోమరిపోతుల వలే కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఈ ప్రపంచంలో అందరికీ 24 గంటల సమయం మాత్రమే వుంటుంది. దేశాలు మారినా కాలమానాలు మారినా రోజుకు మాత్రం 24 గంటలే. ఈ కాలాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారన్న దానిపైనే మీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్న వాస్తవం మరువకండి.
ఒకవేళ మీరు సమయాన్ని బ్యాలెన్స్‌ చేసుకోలేకపోతే ఇతరులు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారు జీవితంలో ఉన్నత స్థానాలకు వస్తారని మరువకండి. అసలు మంచి సమయం చెడు సమయం అంటూ ఉంటుందా? అలా మనకు తెలుస్తుందా? కాలం ఎల్లప్పుడు తటస్థంగానే వుంటుంది. అలాంటప్పుడు మీకు మంచి జరిగితే మంచి సమయం, చెడు జరిగితే చెడు సమయం అనేది ఉంటుందా? అది మన అపరిపక్వపు అవివేకపు, ఆలోచన మాత్రమే. ఇలాంటివన్నీ మన మానసిక స్థాయిలపైన ఆధారపడి వుంటాయన్న వాస్తవం మరువకూడదు. కాలం ఎప్పుడు మీ పని మీరు చేసుకోమనే చెప్తుంది. అంతే కానీ ఇతరుల దష్టిలో మీరు పడాలని మీరు ఇతరులను ఇంప్రెస్‌ చేసుకోవాలని సూచించదు. మీ సమయం మీ చేతిలో వున్నప్పుడు ఇతరుల గురించి మీకనవసరం. మీరేం చేయాలనుకుంటారో అది చెయ్యండి. ఎందుకంటే వారికంటూ కూడా వారి సమయం ఉంటుందని మరవకూడదు.
కాలపరివర్తన సష్టి నియమం. మనిషి మార్పును అంగీకరించడానికి భయపడతాడు. ఆనందం సష్టి నియమం, బాధ మనిషికి ఎప్పుడైన రావచ్చు కానీ అది ఎల్లకాలం వుండదు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదొక కారణంతో సుమారు 1,50,000 మంది మరణిస్తున్నారని అంచనా. మీరు అందులో ఎలాంటి విజయం, గుర్తింపు లేకుండానే కాలగర్భంలో కలిసి పోవాలనుకుంటున్నారా? అందుకే సూర్యాస్తమయం అయ్యేలోపు మీ పనులను పూర్తి చేయండి. రేపు ఆరోగ్యంగా లేస్తారన్న గ్యారంటీ కార్డు మీ జేబులో ఉందా? అలా వుంటే ప్రపంచంలో జరిగిన సైన్సు ఆవిష్కరణలు అన్నీ వాయిదాపడేవే.
కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఇద్దరు అనేక రకాల అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తున్న క్రమంలో సాయంత్రం అవుతుంది. చీకటి పడ్తే యుద్ధం ముగించాల్సి వుంటుంది (యుద్ధ నియమం). అంటే సూర్యుడు అస్తమించేలోపే కర్ణుని వధ జరగాలని శ్రీకష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు. కానీ కర్ణుడు భూమిలో కృంగిన రథాన్ని పైకి లాగటానికి ప్రయత్నం చేస్తుంటాడు. నియమాల ప్రకారం ఎదుటి వ్యక్తి చేతిలో అస్త్రం ఉంటేనే యుద్ధం చేయాలి కానీ ఆరోజు యుద్ధంలో కర్ణుడు మరణించకపోతే రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో కష్ణుడికి తెలుసు కాబట్టే అర్జుడిని ప్రేరేపిస్తాడు. అలా కర్ణుడి వధ జరుగుతుంది. ఇందులో వేరే ఉద్దేశ్యం లేదు ఇక్కడ మీరు ఆలోచించడానికి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి వున్న తేడా ఒక్కటే రోజు ముగిస్తే రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో ఊచించటం కష్టం. కాబట్టి ఇప్పటికే మీరు ఎంతో విలువైన కాలాన్ని వధా చేసి వుంటారు. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అంటాడు ఆది కవి నన్నయ్య. అంటే గడిచిన కాలం ఎంత విలువైనదో, రాబోయే కాలం ఎలా వుంటుందో, ఎంత దుర్భరంగా వుంటుందో ఊహించలేం. గతాన్ని వదిలేసి వర్తమానంలో మీరు ఏం చేయదల్చుకున్నారో స్పష్టంగా ఓ గిరి గీసుకోండి. మీకున్న సమయంలోనే రేపటి గురించి (భవిష్యత్తు) ఆలోచించకుండా ఈ రోజును ఆనందంగా, ఆశావాద దక్పథంలో ముగించండి ‘రేపు’ అనేది మీకు లభించబోయే బోనస్‌. అది సూర్యోదయం ఐన తరువాత మీకు చాయిస్‌ (అవకాశం) ఇస్తుంది. అలాగే ప్రశ్నిస్తుంది కూడా, ఈరోజు ఎలా గడుపుతున్నావ్‌ అని. అందుకే కాలాన్ని వధా చేయకండి. ‘కాలం అనే ఇసుక తిన్నెలపై నీ పాదముద్రలు కనిపించాలంటే ఈసురోమంటూ నడుచుకుంటూ వెళ్ళకు’ అంటాడు అబ్దుల్‌ కలాం. మన వ్యక్తిత్వం మన చుట్టూ వున్న వ్యక్తులకు మన కాలం నాటి సమకాలికులపై ప్రభావం చూయించేలా వుండాలి. ఏదో పుట్టామా చచ్చామా అన్నట్లు కాకుండా ఉండాలి. కాలం నిన్ను ఉన్నోడివా లేనోడివా ఏ కులం, ఏ మతం అని అడగదు. దానికి నువ్వు విలువ ఇస్తే గెలుస్తావు, లేకపోతే అక్కడే ఆగిపోతావు. అందుకే ప్రతి సెకను విలువ తెల్సుకొని జాగ్రత్తగా అడుగులువెయ్యి. అప్పుడు ఆ రోజు కూడా నిన్ను చూసి సంతప్తి పడుతుంది.
– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -