అందుబాటులో 47.68 లక్షల బస్తాల నిల్వ
కలెక్టర్ల పర్యవేక్షణలో
యూరియా సరఫరా : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దనీ, అవసరమైన మేరకు యూరియా సరఫరా చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీనిచ్చారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలను, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి సూచించారు. ప్రత్యేక అధికారులు జిల్లాల వారీగా యూరియా సరఫరాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రబీ సీజన్‌కు గానూ అక్టోబర్ నుంచి మార్చి వరకు కేంద్రం రాష్ట్రానికి వివిధ రకాల ఎరువులుగా మొత్తం 20.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటికే 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్టు పేర్కొన్నారు. కేటాయించిన పరిమాణం కంటే 24 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అధికంగా జరిగిందని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రైతులు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 47.68 లక్షల బస్తాల (2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు) అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించిన మేరకు యూరియా సమయానుకూలంగా రాష్ట్రానికి చేరుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని, భయాందోళనకు గురయి అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, అవసరమైన మేరకే రైతులు వినియోగించుకోవాలని సూచించారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
యూరియాపై ఆందోళన వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



