పి.దయాకర్ సి ఐ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
యూరియా ఆలస్యంపై పరిస్థితులను వివరించిన పోలీసులు రైతులు ప్రతిపక్షాలు యూరియా కోసం ఆందోళన చేయడం కాదు ముందు అవగాహన పెంచుకోవాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ పి దయాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు యూరియా కొరకు ఆందోళనకు సిద్ధమైన రైతులతో సిఐ దయాకర్ మరియు ఎస్ఐ కమలాకర్ లు మాట్లాడి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిఐ దయాకర్ మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు విస్తృతంగా కురిసిన విషయం మన అందరికీ తెలుసు యూరియా కొరకు లారీలు వర్షాల వల్ల ఇన్ టైంలో లోడ్ కాకపోవడం రహదారులు దెబ్బతిన్నందున సకాలంలో రాకపోవడాన్ని గ్రహించాలని అన్నారు. అంతేకాక లారీల యాజమాన్యం సమ్మె కారణంగా కూడా ఒకింత ఆలస్యం జరుగుతుందని అన్నారు. యూరియా కొరతను నివారించేందుకు సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని ఈరోజు సాయంత్రం లేదా రేపటినుండి పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగిందని అదే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నానని అన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయం గురించి సీఐ రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఒకప్పుడు వ్యవసాయం ఎలా ఉండేది పాడిపంటలు ఎలా ఉండేవి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి అని వివరిస్తూ నాటికి ఈనాటికి గల తారతమ్యాన్ని కళ్ళ ముందు ఉంచనట్టుగా రైతులకు వివరించారు.
ప్రస్తుతం సమాజంలో యూరియా వినియోగం పెరగడం వల్ల భూమి విషతుల్యం అయిందన్నారూ సేంద్రియ వ్యవసాయంపై ఆర్గానిక్ వినియోగంపై రైతులు దృష్టి సారించాలని అన్నారు. విషతుల్యమైన పంటలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజలు అనేకం రుగ్మతల తో రోగాల బారిన పడుతున్నారని అన్నారు.
యూరియా వినియోగం తగ్గించుకోవడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ విస్తృతంగా కృషి చేస్తున్నారని అన్నారు. తాతల తండ్రుల కాలంలో పశువుల పెంట తదితర ఎరువులను వాడి భూమి సారం దెబ్బతినకుండా పంటలు పండించామని ఇప్పుడు ఎరువులు క్రిమిసంహారకలను పరిమితికి మించి ఒకరితో ఒకరు పోటీ పడి వినియోగిస్తుండడంతో భూమి విషతుల్యం అవడమే కాకుండా ప్రజల ఆరోగ్యం పాలవుతున్నారు అని అన్నారు. ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్న నానో యూరియా నానో డి ఏ పి వంటి వాటి వినియోగంపై రైతులు దృష్టి సారించి ఎరువుల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ భూమి యొక్క సారాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. అందుకు తమ వంతు సహకారంగా వ్యవసాయ అధికారులతో అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. సిఐ మాటలు విని రైతులు పూర్వపు రోజులను పాతకాలపు పంటలు పండే విధానాన్ని గుర్తుతెచ్చుకున్నారు.