నష్టాలతో కన్నీళ్లు పెడుతుంటే రాజకీయం ముఖ్యమా..?
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- మిర్యాలగూడ
వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే.. వారి గోసను పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ధాన్యం, వరి పైరు కంకులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తుపాను కారణంగా లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిలిందన్నారు. నల్లగొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా పంటలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటంతా వర్షాలతో నాశనమవ్వడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
రైతులకు భరోసా ఇవ్వాల్సిన పాలకులు పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే దృష్టి పెట్టడం సరి కాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, రైతులు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నా కనీసం ఓదార్చే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. రైతుల గోస పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. ప్రతి సీజన్‌లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే బీమా పథకం కింద రైతులను ఆదుకోవాలని, కానీ ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దాని ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన వివరాలను సేకరించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డీఏఓ శ్రీనివాస్‌శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు, సీపీఐ(ఎం) వన్‌టౌన్, టూ టౌన్ కార్యదర్శలు డా.మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, ఐద్వా జిల్లా అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మి, నాయకులు వినోద్‌నాయక్, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల గోస పట్టదా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


