Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంఎన్నికలకు ముందు నిధులు లేవని తెలియదా..?

ఎన్నికలకు ముందు నిధులు లేవని తెలియదా..?

- Advertisement -

– సుందరయ్య స్ఫూర్తితో పోరాడుదాం..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– కుర్నవల్లిలో సుందరయ్య వర్ధంతి సభ
నవతెలంగాణ-తల్లాడ

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఎన్నికలకు ముందు నిధులు లేవన్న విషయం తెలియదా.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన సుందరయ్య 40వ వర్థంతి సభలో జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ముందుగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం సీపీఐ(ఎం) తల్లాడ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన యోధులు, ఆదర్శ నేత దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పేద, ధనికుల మధ్య తేడా, అంటరానితనం, స్త్రీ పురుషుల, మధ్య అసమానత లేకుండా సమాజం ఉండాలని సుందరయ్య భావించారని గుర్తు చేశారు. సుందరయ్య మార్గంలో పోరాటాలను ముందుకు తీసుకోవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. మోడీ కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ, కార్మిక, కర్షక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జాన్‌వెస్లీ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని, 50 వేల నుంచి లక్ష ఎకరాల్లో కార్పొరేటర్లు, హెలికాప్టర్లతో వ్యవసాయం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటిల్లో రైతులు కూలీలుగా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి నుంచి రైతులను వేరు చేసి దూరం చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఎర్రజెండా ఊరుకోదని, గ్రామ గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -