- Advertisement -
- ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎదుట రైతుల ఆందోళన
- ఆర్గనైజర్, కంపెనీ ఫీల్డ్ మేనేజర్ కుమ్మక్కయ్యారని ఆగ్రహం
- డబ్బులివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక
నవతెలంగాణ- మేడ్చల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎదుట సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. పండించిన పంటకు యాజమాన్యం డబ్బులు ఇవ్వడం లేదంటూ మెదక్ జిల్లా రైతులు ఆక్కడ బైటాయించారు. ఈ సందర్భంగా పలువురి రైతులు మాట్లాడుతూ.. మెదక్ మండలంలోని ఖాజీపల్లి గ్రామంతోపాటు పక్కనున్న మరో గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో వరి విత్తనం పండించేందుకు ర్యాలీస్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకుందని తెలిపారు. దీంతో గత సంవత్సరం నవంబర్ నెలలో కంపెనీ సీడ్ అందజేయడంతో 100 ఎకరాల్లో వరి పంటను సాగు చేసి విత్తనాన్ని కంపెనీకి అందజేసినట్టు చెప్పారు. పంటను అందజేసిన 40రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అగ్రిమెంటు రాసిచ్చారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ దగ్గర నుంచి దాదాపు రూ.83 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. తాము కంపెనీకి రావడం వల్ల రానుపోను ఖర్చులకు డబ్బులు వృథా అవుతున్నాయి తప్ప న్యాయం జరగడం లేదన్నారు.
ఆర్గనైజర్ శ్రీపతి జగన్, కంపెనీ ఫీల్డ్ మేనేజర్ మోహన్ కుమ్మక్కై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 2న కంపెనీ యాజమాన్యం ఆర్గనైజర్ అకౌంట్‌లో రూ.38లక్షలు వేసినప్పటికీ తమకు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతు న్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడ్రోజులుగా కంపెనీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మేడ్చల్ జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు, పోలీసులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కంపెనీ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ విషయంపై మేడ్చల్ ఏడీఈ వెంకట్రాంరెడ్డిని వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నానని చెప్పారు. మేడ్చల్ మండల వ్యవసాయ అధికారి అర్చనను సంప్రదించగా, సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఆర్గనైజర్ చంద్రశేఖర్, రైతులు మోహన్, ఎల్లయ్య, శేఖర్, ఎండీ అమిద్, సిద్ధిరాములు యాదవ్, ఎండీ సజ్జు, బాబు పాల్గొన్నారు.
- Advertisement -