– జానిక్ సినర్, స్వైటెక్‌పై తీవ్ర విమర్శలు
– వింబుల్డన్ విజేతలపై ఊహించని వ్యతిరేకత
జానిక్ సినర్ (ఇటలీ), ఇగా స్వైటెక్ (పొలాండ్) ప్రపంచ టెన్నిస్ అగ్ర తారలు. గత ఏడాది డోపింగ్ నిషేధం ఎదుర్కొని.. 2025 వింబుల్డన్ చాంపియన్లుగా నిలిచిన సినర్, స్వైటెక్‌లు ఊహించని వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సహచర టెన్నిస్ క్రీడాకారులు, అభిమానులు సైతం సినర్, స్వైటెక్‌లు స్వల్ప నిషేధంతో బయటపడటంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. వింబుల్డన్‌లో సినర్, స్వైటెక్ విజేతలుగా నిలువగా మరోసారి టెన్నిస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
శ్రీనివాస్ దాస్ మంతటి
వింబుల్డన్ చరిత్రలో తొలిసారి డోపింగ్ నిషేధం ఎదుర్కొన్న అథ్లెట్లు పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలుగా నిలిచారు. ఫలితంగా వింబుల్డన్ విజయ సంబురాలు కాస్త వివాదాలకు దారితీస్తోంది. నిషేధిత ఉత్పేరకాలు ఉద్దేశపూర్వకంగా వాడలేదనే అథ్లెట్ల వాదనకు డోపింగ్ ఏజెన్సీలు తలొగ్గాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డోపింగ్ నుంచి సులభంగా తప్పించుకుని గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించటం ‘టెన్నిస్’కు ఏమాత్రం మంచిది కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ‘ఇది టెన్నిస్‌కు ఏమాత్రం మంచిది కాదని నా అభిప్రాయం’ అని సినర్, స్వైటెక్‌లను ఉద్దేశించి 2022 వింబుల్డన్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ అన్నాడు. జానిక్ సినర్, ఇగా స్వైటెక్ వింబుల్డన్ విజయం వివాదానికి దారితీయగా.. అసలు ఆ ఇద్దరు డోపింగ్ కేసులు ఏమిటీ? గరిష్ట శిక్షల నుంచి ఎలా బయటపడ్డారు? టెన్నిస్‌పై ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దాం.
స్వైటెక్ డోపింగ్ కేసు ఏందంటే..
ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఇగా స్వైటెక్ హృదయ సంబంధిత ఔషధం (టిఎంజెడ్) వాడినందుకు ఆగస్టు 2024లో డోపింగ్‌లో పట్టుబడింది. ఈ కేసులో స్వైటెక్‌పై ఓ నెల రోజుల వేటు పడగా.. గత డిసెంబర్‌లో నిషేధం ముగిసింది. స్వైటెక్ శాంపిల్‌లో దొరికిన ఔషధ అవశేషాలు.. గుండెకు రక్త ప్రసరణను పెంచటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించి, జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది. దీంతో అథ్లెట్లు సుదీర్ఘంగా అలసట లేకుండా పోటీపడగలరు. అందుకే నాడా టీఎంజెడ్‌ను నిషేధించింది. 2022 వింటర్ ఒలింపిక్స్‌కు సమయంలో రష్యా ఫిగర్ స్కేటింగ్ అథ్లెట్ కమిలా వాలీవ ఇదే ఉత్పేరకంతో డోపింగ్‌లో పట్టుబడగా వాడా ఏకంగా నాలుగేండ్ల నిషేధం విధించింది. స్వైటెక్ డోపింగ్ కేసును ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఏఐ) ఔషధ కలుషితం కారణంగానే స్వైటెక్ డోపింగ్‌లో పట్టుబడిందనే వాదనను అంగీకరించింది. భిన్న టైమ్ జోన్లతో ప్రయాణంతో అలసట, నిద్రలేమి సమస్యకు వాడిన ఔషధంలో టిఎంజెడ్ కలిసినట్టు ఐటీఏఐ విశ్వసించింది. ఫలితంగా స్వైటెక్ నెల రోజుల నిషేధమే ఎదుర్కొంది.
సినర్ డోపింగ్ కేసు ఏందంటే..
మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1 జానిక్ సినర్ నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ ‘క్లోస్టెబల్’కు 2024 మార్చిలో పాజటివ్‌గా తేలాడు. కండరాల ధృఢత్వం, నిర్మాణం కోసం వినియోగించే ఈ ఉత్పేరకానికి సినర్ రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి, రెండు సార్లు నిషేధానికి గురయ్యాడు. నిషేధంపై అప్పీల్‌కు వెళ్లిన సినర్ రెండు సార్లు వేటు నుంచి బయటపడ్డాడు. స్వైటెక్ తరహాలోనే సినర్ సైతం ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉత్పేరకం వాడలేదని.. అతడి ఫిజియోథెరపిస్ట్ కారణంగా పొరపాటు జరిగిందని స్వతంత్ర ట్రిబ్యునల్ భావించింది. దీంతో సినర్ నిషేధం నుంచి బయటపడ్డాడు. కానీ ట్రిబ్యునల్ తీర్పుపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఆర్బిట్రేషన్ కోర్టులో సినర్‌కు 1-2 ఏండ్ల నిషేధం కోరాలని వాడా అనుకుంది. కానీ వాడా అనూహ్యంగా సినర్‌తో రాజీ పడింది. మూడు నెలల నిషేధానికి వాడా, సినర్ అంగీకరించారు. ఈ మూడు నెలల నిషేధంలో సినర్ ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను కోల్పోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ సమయానికి మళ్లీ రాకెట్ పట్టాడు.
ఎందుకీ ఆగ్రహం?
ఇగా స్వైటెక్ డోపింగ్ అంశంలో సాంకేతిక ఆధారాలతో ఆమె నిషేధ కాలాన్ని నెల రోజులకు పరిమితం చేశారు. ఐటీఏఏ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ సినర్ అంశంలో అప్పీల్‌కు అవకాశం ఉంది. సినర్ తప్పులేదని ఏజెన్సీ భావించినా.. ఫిజియో, ట్రైనర్‌లనూ చర్యలు లేకుండా వదిలేశారు. ఇది టెన్నిస్ వర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహానికి కారణమైంది. సిమోన హలెప్ 2023లో నాలుగేండ్ల నిషేధానికి గురైంది. అప్పీల్‌కు వెళ్లగా ఆమె నిషేధ కాలాన్ని 9 నెలలకు కుదించారు. దీంతో స్వైటెక్ అంశంలో హలెప్ విమర్శలు గుప్పించింది. జానిక్ సినర్ డోపింగ్ చేయలేదని నాదల్, జకోవిచ్ విశ్వసించినా.. ఒప్పందం కుదుర్చుకోవటంపై భిన్న స్వరాలు వినిపించాయి. ‘స్పోర్ట్స్‌లో డ్రగ్స్ వాడితే బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉండాలి. నిషేధం వేశారా? నిషేధం వేయలేదా? అనేదే ఉండాలి. కానీ ఒప్పందం వంటి పదాలు చూసినప్పుడు.. డోపింగ్‌లో బేరసారాలు జరిగినట్టు స్పష్టమవుతుంది. ఆటగాళ్లు, అభిమానులకు ఇది మంచి సందేశం పంపిందని భావించను’ అని బ్రిటన్ మాజీ ఆటగాడు టిమ్ హెన్‌మాన్ అన్నాడు. సినర్, స్వైటెక్ నిషేధం అంశంలో వేగంగా మంచి లాయర్లతో అప్పీల్‌కు వెళ్లటం వాళ్లకు కలిసొచ్చింది. ‘డోపింగ్‌లో ఒప్పందంపై ఎక్కువ మంది ఆటగాళ్లు సరైనది అనుకోవటం లేదు. టాప్ లాయర్స్‌ను నియమించుకుంటే నిషేధం లేదా నిషేధ కాలాన్ని ప్రభావితం చేయవచ్చని తేలిందని’ నొవాక్ జకోవిచ్ వ్యాఖ్యానించాడు.
టెన్నిస్‌కు, వింబుల్డన్‌కు డోపింగ్ కొత్త కాదు. సినర్, స్వైటెక్‌లు వింబుల్డన్ విజయానికి ముందు డోపింగ్‌లో పట్టుబడగా.. సిమోన హలెప్, మరియ షరపోవ, మార్టినా హింగిస్, అండ్రీ ఆగస్సీలు వింబుల్డన్ విజయం తర్వాత డోపీలుగా తేలారు. సినర్, స్వైటెక్‌లు న్యాయ ప్రక్రియలో నిషేధాలను కుదించుకున్నారు. ఈ అంశంలో సినర్, స్వైటెక్‌లను డోపీలుగా చూడటం తగదు.
నేను, స్వైటెక్ డోపింగ్ అంశంపై మాట్లాడుకున్నాం. ఇది మా ఇద్దరికి ఎంతో క్లిష్టమైన తరుణం. అందుకు ఈ విజయాన్ని మరింత వేడుకగా చేసుకుంటున్నాం. మనపై నమ్మకం ఉంచే, ఉంచని వారు ఎప్పుడూ ఉంటారు. గత 4-5 నెలలు ఎంతో కఠినంగా, ఒత్తిడితో సాగింది’
– జానిక్ సినర్
గత కొన్ని నెలలు మీడియా నన్ను,
నా టీమ్‌ను చూపించిన విధానం ఎంతో బాధించింది. ఇకనైనా నన్ను వదిలేయండి,
నా పని చేసుకోనివ్వండి’
– ఇగా స్వైటెక్